పొదుపు అంటూనే.. లగ్జరీ ప్లైట్‌లో ప్రయాణం!

19 Sep, 2018 18:04 IST|Sakshi

ఇమ్రాన్‌ ఖాన్‌ విదేశీ పర్యటనపై పాకిస్తాన్‌ వ్యాప్తంగా విమర్శలు

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పొదుపు మంత్రాన్ని పాటిస్తోన్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా దేశ అధ్యక్షుడితో సహా, మంత్రులు, అధికారులంతా పొదుపు పాటించాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఇటీవల అదేశాలు జారీ చేశారు. తాను మాత్రం దానికి మినహాయింపు అన్నట్టు తన తొలి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. సౌదీ రాజు సల్మాన్‌ బీన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆహ్వానం మేరకు సౌదీ వెళ్లిన ఇమ్రాన్‌ వీవీఐపీ వసతులు కలిగిన ప్రత్యేక విమానంలో పర్యటనకు వెళ్లారు.

ఇమ్రాన్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారుల, మంత్రుల ప్రయాణల్లో కోత విధించి.. అందరూ సాధారణ వాహనాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుల్లో పొదుపు పాటించాలని.. ప్రజాధనాన్ని వృథా చేయకూడదంటూ అదేశాలు జారీ చేశారు. పొదుపు పాటించాలని ఆదేశాలు జారీ చేసి.. తాను మాత్రం లగ్జరీ విమానాల్లో విదేశాలకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇటీవల 102 లగ్జరీ కార్లను, గేదెలను వేలంలో అమ్మేయాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇమ్రాన్‌ తన తొలి పర్యటనకే ప్రత్యేక సదుపాయాలున్న వీవీఐపీ విమానాన్ని ఉపయోగించడంపై రాజకీయ పార్టీలు గుర్రుమంటున్నాయి. గత ఏడాది చివరినాటికి పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం.. అంటే రూ.30 లక్షల కోట్ల అప్పును కలిగివున్న విషయం తెలిసిందే. కాగా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు అజీజ్‌తో ఇమ్రాన్‌ భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చించనున్నారు. సౌదీ వెళ్లిన ఇమ్రాన్‌ దుబాయ్‌లో జరిగే పాక్‌-భారత్‌ మ్యాచ్‌కు ఇమ్రాన్‌ హాజరైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు