కూటమి తప్పదా?

28 Jul, 2018 03:14 IST|Sakshi

265 స్థానాల్లో ఫలితాలు వెల్లడి.. ఇమ్రాన్‌కు 118

పాక్‌ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా పీటీఐ

ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు అవసరం

రాజకీయ అస్థిరతపై నిపుణుల ఆందోళన

కరాచీ/ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా నిలిచిన పీటీఐ మేజిక్‌ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచింది. శుక్రవారం రాత్రి వరకు అధికారికంగా వెల్లడైన 265 స్థానాల ఫలితాల్లో పీటీఐ 118 చోట్ల విజయం సాధించగా.. మరో రెండుచోట్ల ఆధిక్యంలో ఉంది. పీఎంఎల్‌ ఎన్‌ 62 స్థానాల్లో, పీపీపీ 43 చోట్ల గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థులు 12 చోట్ల గెలిచారని ఎన్నికల సంఘం వెల్లడించింది.  మతతత్వ పార్టీల కూటమి అయిన ఎంఎంఏపీ 11 స్థానాల్లో గెలవగా.. ఎంక్యూఎం 4 చోట్ల గెలిచింది. గెలిచిన ఎంపీ సీట్ల ఆధారంగా మహిళలు, మైనారిటీ సభ్యుల కోటాలో పీటీఐ ఖాతాలోకి మరో 34–35 స్థానాలు దక్కనున్నాయి. మొత్తంగా కలుపుకుంటే పార్లమెంటులో పీటీఐ ఎంపీ సీట్ల సంఖ్య 160 వరకు ఉంటుందని అంచనా.

ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మొత్తం 172 స్థానాలు అవసరం. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌కు స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్‌ ఖాన్‌ శుక్రవారం పీటీఐ ముఖ్యనేతలతో ఇస్లామా బాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ విస్తరణ తదితర అంశాలపై వీరితో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు దక్కుతుందని, ఆందోళన అవసరం లేదని ఆయన పార్టీ నేతలతో దీమా వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్‌కు వీవీఐపీ ప్రొటోకాల్‌ను అమల్లోకి తెచ్చారు.మరోవైపు, పాక్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించాయి. పారదర్శకత లేని ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాతీర్పును ప్రతిబింబించడం లేదని అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించబోమని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి.   

పంజాబ్‌ ప్రావిన్స్‌లో పీటీఐ
నవాజ్‌ షరీఫ్‌ కంచుకోట అయిన పంజాబ్‌ ప్రావిన్సులో తొలిసారిగా పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. 297 అసెంబ్లీ స్థానాల్లో పీఎంఎల్‌ఎన్‌ 127 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. 117 స్థానాలు గెలిచిన పీటీఐ.. స్వతంత్రుల (27 సీట్లు)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అటు 140 సీట్లున్న సింధ్‌ ప్రావిన్స్‌లో 72 చోట్ల గెలిచిన పీపీపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇక్కడ పీటీఐ 20 చోట్ల గెలిచింది. అటు, 99 స్థానాలున్న ఖైబర్‌–ఫక్తున్‌ఖ్వా అసెంబ్లీలో పీటీఐ 66 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. బెలూచిస్తాన్‌ అసెంబ్లీలో 51 స్థానాలుండగా.. కొత్తగా ఏర్పాటైన బెలూచిస్తాన్‌ అవామీ 13 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది.  

రాజకీయ అస్థిరతపై ఆందోళన
పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగిన తీరు ఫలితాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ దేశ తదుపరి ముఖచిత్రంలో అస్థిరత తప్పదని పాక్‌ రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిగ్గింగ్‌ జరిగిందనే ఆరోపణలు, ముఖ్యనేతలంతా వారి కంచుకోటల్లో ఓడిపోవడం వంటి కారణాలతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు.  ప్రజల్లో పీటీఐ పట్ల సానుభూతి లేనప్పటికీ ఈ ఫలితాలు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్‌ రాజకీయాల్లో వచ్చే కొద్ది రోజులు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి’ అని పాక్‌ రాజకీయ  నిపుణుడు ఒమైర్‌ అలావీ పేర్కొన్నారు.  

కుట్ర జరిగింది: విపక్షాలు
పార్లమెంటులో 68 స్థానాలు గెలవడం, పంజాబ్‌ ప్రావిన్స్‌ అసెంబ్లీలో 122 స్థానాల్లో గెలవడం తమ పార్టీపై జరిగిన కుట్రేనని పీఎంఎల్‌–ఎన్‌ ఆరోపిస్తోంది. అటు పీపీపీ కూడా తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా ఓడిపోయామని.. ఏకంగా పార్టీ చైర్మన్‌ బిలావల్‌ భుట్టో కంచుకోట అయిన కరాచీలో ఓడిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలను హైజాక్‌ చేశారని.. ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. ఇమ్రాన్‌ గెలవలేదని.. ఆయన్ను కొందరు (ఆర్మీ, ఎన్నికల సంఘం పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ) గెలిపించారన్నారు.

తొలి హిందూ ఎంపీ
పాకిస్తాన్‌లో తొలిసారిగా ఓ హిందువు ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు. పీపీపీ తరపున సింధ్‌ ప్రావిన్స్‌లోని థార్‌పార్కర్‌–2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్‌ కుమార్‌ మలానీ 20వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. హిందు రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్‌.. 2003–08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్‌ ఎంపీగా ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు