‘మూడో పెళ్లి’ లొల్లిపై స్పందన

26 Apr, 2018 10:27 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, ‘పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌’ (పీటీఐ) పార్టీ అధ్యక్షడు ఇమ్రాన్‌ ఖాన్‌కు కోపం వచ్చింది. ముచ్చటపడి చేసుకున్న మూడో పెళ్లి పెటాకులైందంటూ  మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆయన తరపున పార్టీ పీటీఐ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రచురించిన కథనాలపై పీటీఐ వర్గాలు మండిపడుతున్నాయి. తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ ఉర్దూ పత్రిక ‘రోజ్నామా ఉమ్మత్‌’ ఎడిటర్‌కు, మరికొన్ని వెబ్‌సైట్లకు లేఖలు రాసింది.

కాగా, ఇమ్రాన్‌ తన ఆధ్యాత్మిక సలహాదారు అయిన బుష్రా మనేకాను మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె బానిగలా(ఇమ్రాన్‌ నివాసం)లో కనిపించటం లేదు. దీంతో ఆమె ఇళ్లు విడిచివెళ్లిపోయిందంటూ పుకార్లు మొదలయ్యాయి. మనేకా పిల్లల(అంతకు ముందు భర్త వల్ల కలిగిన సంతానం) వ్యవహారమే దీనంతటికి కారణమంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఇమ్రాన్‌కు బుష్రాతో విభేదాలు తలెత్తాయని.. ఆ పరిస్థితి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయేలా పురిగొల్పిందని రోజ్నామా ఉమ్మత్‌ అనే ఒక ఉర్దూ పత్రిక ప్రచురించింది.

అనంతరం ఈ వార్తలు సోషల్‌ మీడియాలో, ఇతర పబ్లికేషన్లలో చక్కర్లు కొట్టడంతో ఇమ్రాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. ‘పీటీఐ’ ఈ వ్యవహారంలో మౌనం వహిస్తూ వచ్చింది. అయితే సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యే సరికి ఇప్పుడు స్పందించింది. మరోవైపు పెంపుడు కుక్కల వ్యవహారం మనేకాకు చికాకు తెప్పించిందన్న మరో కథనం కూడా చక్కర్లు కొట్టింది.

మరిన్ని వార్తలు