మక్కా మసీదులో ఘోర ప్రమాదం

24 Sep, 2015 15:21 IST|Sakshi
మక్కా మసీదులో ఘోర ప్రమాదం

- 107 మంది మృతి  
- మసీదుపై కూలిన భారీ క్రేన్
- 184 మందికి గాయాలు

- క్షతగాత్రుల్లో 9 మంది భారతీయులు

రియాద్:
ముస్లింలకు అత్యంత పవిత్రస్థలమైన మక్కా మసీదులో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం కుప్పకూలి మసీదు ప్రాంగణంలో పడింది. 107 మంది మృత్యువాతపడగా... మరో 184 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ అరేబియాలోని మక్కా మసీదును హజ్ యాత్రను పురస్కరించుకొని ఏటా లక్షలమంది సందర్శిస్తారు. కాబాకు నలువైపులా ప్రార్థనలు చేస్తారు. హజ్ యాత్ర ఇదే నెల ప్రారంభం కానుంది. కాబా మసీదు ప్రాంగణాన్ని విస్తరించేందుకు సౌదీ పనులు చేపట్టింది. స్టేడియంలా నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒకేసారి 22 లక్షల మంది పట్టేలా 43 లక్షల చదరపు అడుగుల మేర ప్రాంగణాన్ని విస్తరిస్తున్నారు. నలుమూలలా భారీ క్రేన్లతో పనులు జరుగుతున్నాయి.

ఒక క్రేన్ పైభాగం ఆకస్మాత్తుగా కూలిపోయి మసీదు ప్రాంగణంపై పడింది. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల కోసం భారీగా జనం రావడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. పలువురు రక్తమోడుతున్న గాయాలతో ఎటూ కదల్లేని స్థితిలో కూర్చుండిపోయారు.   ప్రమాద ప్రాంతం భీతావహంగా కనిపించింది. దుర్ఘటన సమయంలో భారీ వాన కురుస్తోంది. క్షతగాత్రుల్లో 9 మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ  ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.  సౌదీ లోని భారత కాన్సు ల్ జనరల్ మక్కా వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, భారత డాక్టర్లు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారని... ఇప్పటిదాకా తొమ్మిది మంది భారతీయులు గాయపడినట్లు సమాచారం అందిందని ఆయన వెల్లడించారు.
 

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు