ఆ దేశంలో అబార్షన్‌ అయితే జైలే!

11 Jun, 2016 18:17 IST|Sakshi
ఆ దేశంలో అబార్షన్‌ అయితే జైలే!

శాన్‌ సాల్వడార్‌: అబార్షన్‌ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహిళలు ఉద్యమిస్తుండగా, ఎల్‌ సాల్వడార్‌ దేశంలో ఇప్పటికీ అబార్షన్‌ అయితే జైలుకు పంపించే ఆటవిక చట్టాలు అమలవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా కాకుండా సహజ సిద్ధంగా అబార్షన్‌ అయిన కేసుల్లో కూడా అమాయక మహిళలు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. ఏడాది, రెండేళ్లు కూడా కాదు.. ఏకంగా 40 ఏళ్లు జైలుశిక్ష పడుతున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. న్యాయపరంగా పోరాడేందుకు ఆర్థిక స్థోమత లేని అనాథలు, అభాగ్యులు జైళ్లలో మగ్గిపోతున్నారు.

మారియా థెరిసా రివేరా అనే యువతి కూడా రాక్షస చట్టాలకు ఇలాగే చిక్కారు. ఒకోజు ఆమెకు తెలియకుండా అబార్షన్‌ జరిగిపోయింది. ఆ కారణంగా ఆమె మూర్ఛపోయింది కూడా. నిద్ర లేచేసరికి ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నారు. ఆ విషయం గ్రహించేలోగానే పోలీసులు వచ్చి ఆమె చేతులకు బేడీలు వేశారు. రాక్షస చట్టాల కింద ఆమెను విచారించిన కోర్టు 40 ఏళ్లు జైలుశిక్ష విధించింది. స్వతహాగా ఆమె ధైర్యవంతురాలవడం, ఆమెకు పలువురు సామాజిక కార్యకర్తలు అండగా నిలవడంతో అలుపెరగని న్యాయ పోరాటం సాగించారు. ఫలితంగా కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. దాంతో ఐదేళ్ల శిక్ష అనంతరం గత మే నెల పదో తేదీన జైలునుంచి విడుదలయ్యారు. 2011 నుంచి ఐదేళ్ల జీవితం మాత్రం జైలు ఊచలకే అంకితమైంది.

ఆమె లాంటి, అభాగ్యులు, అమాయకపు మహిళలు ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు. సామాజిక కార్యకర్తల ఆసారాతో న్యాయ పోరాటం చేయడం వల్ల రివేరాకు చివరకు విముక్తి లభించింది. అలాంటి పరిస్థితి లేనివాళ్లు ఎంతో మంది ఇప్పటికీ జైళ్లలోనే మగ్గిపోతున్నారు. 2000 సంవత్సరం నుంచి 2011 మధ్య దాదాపు 123 మంది పేద మహిళలు అకారణంగా చట్టం కోరల్లో చిక్కుకుపోయారని, వారిలో కొంతమంది జైలు శిక్షలు పూర్తి చేసుకొని విడుదల కాగా, మరి కొందరు జైల్లోనే ఉన్నారని ఎల్‌ సాల్వడార్‌ పునరుత్పత్తి హక్కుల సంఘం తెలియజేసింది. అబార్షన్‌ చట్టానికి బలవుతున్న వారిలో ఎక్కువమంది రోజు కూలీలు, పని మనుషులు, కడు పేదలే ఉంటున్నారని ఆ సంస్థ వెల్లడించింది.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా అబార్షన్‌ను కఠినమైన నేరంగా పరిగణించే చట్టాలను 1990 ప్రాంతంలో ఎల్‌ సాల్వడార్‌ తీసుకొచ్చింది. అబార్షన్‌ చేయకపోతే శిశువు లేదా తల్లికి ప్రాణాపాయం ఉన్నా అబార్షన్‌ చేయించుకోవడం నేరమే. రేప్‌ సంఘటనల్లో కూడా అబార్షన్‌ను చట్టాలు అనుమతించడం లేదు. రేప్‌ కారణంగా అబార్షన్‌ చేయించుకున్నారన్న ఆరోపణలపై వెరోనికా అనే పనిమనిషికి 30 ఏళ్లు, ఇంట్లో ముందస్తుగా బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఆ బిడ్డ పురిట్లోనే చనిపోవడంతో అల్బా అనే ఆమె సహచరికి 20 ఏళ్లు జైలుశిక్ష పడింది. మృత శిశువుకు జన్మనిచ్చిన జొహానా అనే మహిళకు కూడా హోమిసైడ్‌ కింద జైలుశిక్ష విధించారు.

2011 తర్వాత సహజసిద్ధమైన అబార్షన్ల విషయంలో పోలీసులు తొందరపడి కేసులు దాఖలు చేయకపోవడంతో కేసులు తగ్గినా, చట్టాల్లో సంస్కరణలు రావాలని సామాజిక కార్యకర్తలు అక్కడ పోరాటం చేస్తున్నారు. గర్భ నియంత్రణ సాధణాలను దేశలోని చట్టాలు అనుమతిస్తున్నా, పేదవారికి అవి అందుబాటులో ఉండడం లేదు. అబార్షన్‌ కోసం గుట్టుచప్పుడు కాకుండా కొంత మంది మహిళలు నాటు పద్ధతులను అనుసిరిస్తుండడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఓ నివేదికలో తెలిపింది. అబార్షన్‌ చట్టాల్లో సంస్కరణలు తీసుకరావాలని ఈ సంస్థ కూడా పోరాటం జరుపుతోంది. కట్టుబాట్లకు, మత సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే దేశంలో ప్రభుత్వం అందుకు చొరవ తీసుకోవడం లేదు.

>
మరిన్ని వార్తలు