15 వేలిస్తే.. సారీ చెబుతాం!

9 Sep, 2014 10:42 IST|Sakshi
15 వేలిస్తే.. సారీ చెబుతాం!

మన సన్నిహితులను అనవసరంగా చెడామడా తిట్టేశాం లేదా మన మాటలతో వారిని నొప్పించాం.. సారీ చెప్పాలి. కానీ ఈగో అడ్డొస్తోంది. మరెలా? జపాన్‌లో అయితే దీనికో సులువైన పరిష్కారం ఉంది. ఎందుకంటే.. ఇక్కడ మన తరఫున క్షమాపణలు చెప్పేందుకూ ప్రత్యేకమైన సంస్థలున్నాయి! ఈ అపాలజీ ఏజెన్సీలకు కొంత మొత్తం ముట్టజెబితే.. మన తరఫున వారు సారీ చెబుతారన్నమాట. ఇందుకోసం సదరు సంస్థలు తమ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తాయి. వారు పక్కా ప్రొఫెషనల్స్ అట. పరిస్థితి తీవ్రతను బట్టి క్షమాపణలు చెప్పే విధానాల్లో తేడాలుంటాయి.
 
ఇందులో భోరున ఏడుస్తూ.. సారీ చెప్పే విధానమూ ఉంది. కొన్నిసార్లయితే.. ఈ సంస్థ తరఫున సారీ చెప్పడానికి వెళ్లేవారు.. వారు మన బంధువో లేక స్నేహితుడో అని అవతలవాళ్లకు చె ప్పి.. మనం చాలా బాధపడుతున్నామని.. అందుకే మన తరఫున సారీ చెప్పడానికి వచ్చామని నమ్మిస్తారు. ఇలా చేయడం మోసమంటూ పలువురు ఈ సంస్థలను విమర్శిస్తున్నా.. వీరి బిజినెస్ ఏ మాత్రం తగ్గడం లేదు. వీరికి వచ్చేవి కూడా ఎక్కువగా ప్రేమ వ్యవహారాలే ఉంటున్నాయట. నేరుగా మనిషిని పంపి సారీ చెప్పాలంటే రూ.15 వేలు, ఫోన్-ఈమెయిల్ ద్వారా క్షమాపణలకు రూ.5 వేలు వసూలు చేస్తామని  షాజాయియా ఐగా ప్రో ఏజెన్సీ సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు