ఇక భాష రాకపోయినా.. మాట్లాడొచ్చు

17 May, 2016 10:47 IST|Sakshi
ఇక భాష రాకపోయినా.. మాట్లాడొచ్చు

మన దేశంలో, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు వాళ్ల భాష మనకు, మన భాష వాళ్లకు అర్థంగాక ఇబ్బందిపడకతప్పదు. చాలామంది జీవితంలో ఇలాంటి సందర్భం ఎదురై ఉంటుంది. ఈ కష్టాలను తీర్చేందుకు త్వరలో స్మార్ట్ ఇయర్పీస్ మార్కెట్లోకి రాబోతోంది.

న్యూయార్క్కు చెందిన కంపెనీ వేవర్లీ ల్యాబ్స్ ప్రపంచంలోనే తొలిసారి ఈ ఇయర్పీస్ను రూపొందించింది. ఇద్దరు వ్యక్తులు రెండు వేర్వేరు భాషల్లో మాట్లాడుకున్నప్పుడు, అప్పటికప్పుడు వారి సంభాషణలను అనువాదం చేసి ఇద్దరికీ అర్థమయ్యేలా చేయడం దీని ప్రత్యేకత. మాట్లాడేటపుడు హెడ్పీస్ను చెవిలో పెట్టుకోవాలి. ట్రాన్స్లేషన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఇయర్పీస్ను పైలట్ అని పిలుస్తున్నారు. భాషల మధ్య సమన్వయం చేసేలా ఇందులో ఓ యాప్ ఉంటుంది.

పైలట్ మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో తయారు చేశారు. కాగా దీన్ని జతగా కొనాలి. ఓ వ్యక్తి ఒకదాన్ని, అతను మాట్లాడేవ్యక్తి మరొకదాన్ని చెవిలో ఉంచుకోవాలి. పైలట్తో పాటు పోర్టబుల్ చార్జర్ ఇస్తారు. ఇయర్పీస్ సృష్టికర్త ఆండ్రూ ఒషోవా.. ఓ ఫ్రెంచ్ అమ్మాయితో మాట్లాడినపుడు భాష రాక ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత అతనికి ఓ ఐడియా వచ్చింది. ఇలాంటి సమస్యను తీర్చే సాధనాన్ని తయారు చేయాలని కృషిచేశాడు. ఫలితంగా ఇయర్ఫీస్ను రూపొందించాడు. ఆండ్రూ, తన ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్ ఇయర్పీస్ పెట్టుకుని హాయిగా మాట్లాడుకున్నారు.

వేవర్లీ ల్యాబ్స్ తొలుత యూరోపియన్ భాషలు ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్లలో స్మార్ట్ ఇయర్పీస్ను విడుదల చేయాలని భావిస్తోంది. తర్వాత తూర్పు ఆసియా భాషలు హిందీ, అరభిక్తో పాటు ఆఫ్రికన్ భాషల్లో మార్కెట్లోకి రానుంది. వేవర్లీ ల్యాబ్స్ పైలట్ ప్రొమోను ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా నెటిజెన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. లక్షా 67 వేల షేర్లు రాగా, 77 లక్షల మంది వీక్షించారు. నెటిజన్ల స్పందన చూసి వేవర్లీ ల్యాబ్స్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఇయర్పీస్ రూపకల్పన కోసం దీర్ఘకాలం పనిచేశామంటూ, మద్దతు ఇచ్చిన నెటిజన్లకు ధన్యవాదాలు తెలియజేసింది. మార్కెట్లో పైలట్ ధర 20 వేల రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు