ప్రపంచ ఆర్థిక రంగానికి భారత్‌-చైనాలే వెన్నెముక

28 Apr, 2018 19:59 IST|Sakshi

బీజింగ్‌: భారత్‌, చైనాలు ప్రపంచ ఆర్థిక రంగానికి వెన్నెముకలాంటివని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ఈ రెండు దేశాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. వువాన్‌లో జరిగిన ఇరుదేశాల ప్రతినిధుల సదస్సులో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. బిలియన్‌ జనాభాలు ఉన్న ఈ రెండు దేశాలు.. ప్రపంచ మార్కెట్‌కు ఎంతో కీలకమని ఆయన అన్నారు. 

‘ప్రపంచ సుస్థిరత కోసం భారత్‌-చైనా మధ్య సంబంధాలు అవసరం. ప్రపంచ అభివృద్ధిలో రెండు దేశాల అర్థిక సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సోషలిజం దారిలో చైనా నూతన  ఒరవడిని సృష్టించింది. సరికొత్త సంస్కరణలతో మోదీ భారత్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. రెండు దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాం. 21వ శాతాబ్ధంలో  చైనా- భారత్‌ మధ్య సంబంధాలు ప్రపంచ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నాయి. చైనా, భారత్‌ పోరుగు దేశాలు. అంతకు మించి మంచి స్నేహితులు’ అని జిన్‌పింగ్‌ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. చైనా న్యూస్‌ ఏజెన్సీ జిన్‌హువా.. జిన్‌పింగ్‌ ప్రసంగాన్ని యథాతథంగా ప్రచురించింది. 

రెండు దేశాలు స్వతంత్ర్య విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నాయని..  ఇరు దేశాల ఆలోచనా ధోరణి ఒకే రీతిలో ఉందని ఆయన తెలిపారు. చైనా, భారత్‌ మధ్య 1950లో కుదిరిన పంచశీల  ఒప్పందంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు