చిచ్చురేపుతున్న నేపాల్‌!

25 May, 2020 05:29 IST|Sakshi

భారత భూభాగాన్ని కలుపుతూ కొత్త మ్యాప్‌ తెచ్చిన పొరుగు దేశం

మిత్ర దేశాల మధ్య చిచ్చు రేగింది. భారత్, నేపాల్‌ సరిహద్దు వివాదం... సరికొత్త మలుపులు తిరుగుతోంది. నేపాల్‌ కొత్త మ్యాపుతో మంట రేగుతోంది. ఏమిటీ వివాదం ? ఎందుకు ముదురుతోంది ?

వివాదం మొదలైంది ఇలా ...  
జమ్మూ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చూపిస్తూ గత ఏడాది నవంబర్‌లో భారత్‌ ఒక మ్యాప్‌ విడుదల చేసింది. అందులో కాలాపానీ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్‌ భూభాగంలో ఉన్నట్టుగానే చూపించింది. అప్పట్లోనే నేపాల్‌లో అక్కడక్కడా నిరసన స్వరాలు వినిపించాయి. ఆ తర్వాత మానససరోవర్‌కు వెళ్లే యాత్రికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి లిఫులేఖ్‌ ప్రాంతంలో నిర్మించిన 80.కి.మీ. రహదారిని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ నెల 8న ప్రారంభించారు. దీంతో నేపాల్‌ ఒక్కసారిగా కస్సుమంది. లిఫులేఖ్, కాలాపానీ, లింపియాథురా ప్రాంతాలను తమ దేశ భూభాగంగా చూపిస్తూ కొత్త దేశ పటాన్ని విడుదల చేసింది. దానికి రాజ్యాంగబద్ధతను తీసుకురావడానికి పార్లమెంటులో తీర్మానం కూడా చేసింది. దీనిపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్‌కు స్పష్టం చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.  

నేపాల్‌ బుసల వెనుక డ్రాగన్‌ ?

నేపాల్‌కు ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ భారత్‌ ఆదుకుంటుంది. ఎన్నో అంశాల్లో నేపాల్‌ భారత్‌పైనే ఆధారపడి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో నేపాల్‌ చీటికీ మాటికీ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌ నుంచి వచ్చిన వారితో విస్తరించిన కరోనా వైరస్‌ చైనా కంటే డేంజర్‌ అంటూ నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పడు సరిహద్దు వివాదానికి తెరతీశారు. దీని వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి.

నేపాల్‌ ప్రధానమంత్రి ఓలి ఏకపక్ష నిర్ణయాలతో  అక్కడ రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది.. ఓలి రాజీనామా చేయాలని ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు సెంటర్‌) డిమాండ్‌ చేసింది. ఆ సమయంలో చైనా ఓలికి అండగా నిలబడింది. నేపాల్‌లో చైనా రాయబారి ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్టుగా కథనాలు వచ్చాయి. ప్రతిఫలంగా ఓలి చైనాకు కొమ్ముకాస్తూ భారత్‌ రక్షణని ప్రమాదంలో పడేసే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోవిడ్‌–19ని అరికట్టడంలో వైఫల్యం, పార్టీలోనూ, ప్రజల్లోనూ పట్టు కోల్పోతున్న ఓలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కాలాపానీ అంశాన్ని పెద్దది చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా
వినిపిస్తున్నాయి.

కాలాపానీ చరిత్రలోకి వెళితే
ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌ జిల్లాలో నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమే కాలాపానీ. సముద్రమట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 35 చదరపు కిలో మీటర్లు ఉండే ఈ ప్రాంతం మహాకాలీ నది జన్మస్థావరం. ఎప్పట్నుంచో ఇది భారత్‌లో అంతర్భాగంగానే ఉంది. ఈ మార్గం ద్వారానే భారతీయ యాత్రికులు అత్యంత సాహసోపేతమైన మానస సరోవర్‌ యాత్రకి వెళతారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో భారత్‌ అక్కడ 18 సైనిక శిబిరాల్ని ఏర్పాటు చేసింది.

1969లో నేపాల్‌తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంతో కాలాపానీలో మినహా మిగిలిన సైనిక శిబిరాలన్నీ తొలగించింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలపై నిఘా పెట్టాలంటే కాలాపానీ ప్రాంతంలో సైనిక శిబిరం అత్యంత ముఖ్యం. అయితే కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్‌ వాదిస్తోంది. నేపాల్‌కు, ఈస్ట్‌ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలీ నది నేపాల్‌లో ప్రవహిస్తోందని చెప్పారని, ఆ నది పుట్టిన భూభాగం తమదేనన్నది ఆ దేశం వాదన.

దేశ పటాన్ని మార్చడంలో నేపాల్‌ ఏకపక్ష నిర్ణయానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. సరిహద్దు వివాదాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారమవుతాయన్న భావనకు వ్యతిరేకంగా ఓలి సర్కార్‌ వ్యవహరిస్తోంది. సరిహద్దు రేఖల్ని తమ ఇష్టారాజ్యంగా మార్చేస్తామంటే భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు.
అనురాగ్‌ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి  

మరిన్ని వార్తలు