ఆస్ట్రేలియాతో ఏడు ఒప్పందాలు

5 Jun, 2020 04:52 IST|Sakshi
ఆన్‌లైన్‌లో స్కాట్‌తో మాట్లాడుతున్న మోదీ

రక్షణ రంగంలో పరస్పర సహకారానికి అంగీకారం 

మోదీ–మారిసన్‌ ఆన్‌లైన్‌ సదస్సు  

న్యూఢిల్లీ–మెల్‌బోర్న్‌: భారత్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ మధ్య గురువారం ఆన్‌లైన్‌ సదస్సు జరిగింది. కోవిడ్‌ నేపథ్యంలో ఇరువురు నేతలు ఆన్‌లైన్‌ ద్వారా చర్చలు జరిపారు. మిలటరీ స్థావరాల్లో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్‌ లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ (ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ)పై ఇరువురు సంతకాలు చేశారు.

ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో పరస్పరం సహకారం అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాలు మరొకరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇకపై మరమ్మతులు, సైనికుల అవసరాలను తీర్చే సామగ్రి సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాన్ని మరొకరు వినియోగించుకోవచ్చు. ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ ఒప్పందంతో పాటుగా సైబర్‌ టెక్నాలజీ, ఖనిజాలు తవ్వకాలు, మిలటరీ టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులు, జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

► ఇండో పసిఫిక్‌ తీర ప్రాంతం భద్రతపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. ‘‘షేర్‌డ్‌ విజన్‌ ఫర్‌ మ్యారీ టైమ్‌ కోపరేషన్‌ ఇన్‌ ది ఇండో పసిఫిక్‌’’అన్న పేరుతో ఒక డిక్లరేషన్‌ను ఆవిష్కరించాయి.  

సంక్షోభాల నుంచి అవకాశాలు
ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపించిన తీవ్రమైన సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి బయటపడడానికి సమన్వయంతో, సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. దానికనుగుణంగా అన్ని రంగాల్లోనూ సమగ్రమైన సంస్కరణలు తీసుకువచ్చే ప్రక్రియ మొదలైందని చెప్పారు.

► అణు సరఫరా గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి ఆస్ట్రేలియా సంపూర్ణ మద్దతుని ప్రకటించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ని శాశ్వత సభ్యదేశంగా చేయడానికి మద్దతునిస్తామని చెప్పింది.

సమోసా కిచిడీ దౌత్యం
స్కాట్‌ మారిసన్‌ గుజరాతీ కిచిడి వండి వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. మోదీతో ఆన్‌లైన్‌ సదస్సులో పాల్గొన్న ఆయన ఈసారి ఇరువురి సమావేశం జరిగినప్పుడు తానే స్వయంగా కిచిడి వండి తినిపిస్తానన్నారు. భారతీయ సమోసా, మాంగో చెట్నీలు స్వయంగా తయారు చేసిన మారిసన్‌ వాటి రుచిని ఆస్వాదిస్తూ షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తానే స్వయంగా భారత్‌కు వచ్చి మోదీని కలుసుకొని సమోసా తినిపించాలని అనుకున్నానని మారిసన్‌ చెప్పారు.

మోదీ ఆలింగనాన్ని కూడా మిస్‌ అయ్యానన్నారు. ఈ సారి కలిసినప్పుడు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని గుజరాతీ కిచిడీని స్వయంగా వండి తినిపిస్తానని చెప్పారు. దీనికి మోదీ బదులిస్తూ ‘మీరు సమోసాలు షేర్‌ చేయగానే దేశమంతా దాని గురించే మాట్లాడారు. ఇంక అందరూ గుజరాతీ కిచిడీ గురించే మాట్లాడుకుంటారు. గుజరాతీయులు చాలా ఆనందపడతారు. ఈ కిచిడీని దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు’అని మోదీ బదులిచ్చారు.  
 

>
మరిన్ని వార్తలు