‘ఎస్‌–400’పై అమెరికా కన్నెర్ర

1 Jun, 2019 04:52 IST|Sakshi

రక్షణ సంబంధాలపై తీవ్రప్రభావం పడుతుందని భారతకు హెచ్చరిక

వాషింగ్టన్‌: రష్యా నుంచి అత్యాధునిక ఎస్‌–400 క్షిపణి నిరోధక వ్యవస్థను కొనుగోలు చేయాలన్న భారత్‌ నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి మండిపడింది. భారత్‌ ఈ ఒప్పందం విషయంలో ముందుకెళితే అమెరికా–ఇండియాల రక్షణ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ విషయమై అమెరికా రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ..‘అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతున్నంతకాలం రష్యా నుంచి ఎస్‌–400ను కొనుగోలు విషయంలో భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండదనడం సరికాదు.

క్యాస్టా చట్టం ప్రకారం రష్యా నుంచి ఆయుధాల, ఇతర టెక్నాలజీని కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు అమలవుతాయి. దీనివల్ల భారత్‌కు భవిష్యత్‌లో అత్యాధునిక సాంకేతిక సహకారం ఆగిపోతుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల ఆ దేశం అనుసరిస్తున్న దుందుడుకు విధానాలకు మద్దతుపలికినట్లు అవుతుంది. ఈ విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. నాటో భాగస్వామి అయిన టర్కీతో ఇదే విషయమై చర్చలు సాగుతున్నాయి. ఎస్‌–400 వ్యవస్థ కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా అత్యుత్తమ టెక్నాలజీ వ్యవస్థలను రష్యన్‌ ఆయుధ వ్యవస్థలతో కలగాపులగం కానివ్వం’ అని స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు