భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారొద్దు

13 Aug, 2019 04:47 IST|Sakshi
చైనా విదేశాంగమంత్రితో జైశంకర్‌ కరచాలనం

చైనాకు సూచించిన భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌

భారత్‌–చైనా సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరుకుంటాయని ఆకాంక్ష

ఉపాధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో భేటీ

బీజింగ్‌/ఇస్లామాబాద్‌: భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370ని భారత్‌ ఏకపక్షంగా రద్దుచేయడాన్ని ఖండిస్తున్నామని చైనా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్‌ సదస్సులో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ భారత్‌–చైనాల సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌ చేరుకున్న జై శంకర్,  చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే జై శంకర్‌ చైనాను సందర్శించడం గమనార్హం.

వారు వాస్తవాన్ని గుర్తించారు: బీజింగ్‌లో సోమవారం జరిగిన భారత్‌–చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో జై శంకర్‌ మాట్లాడుతూ..‘అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌–చైనాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా విశిష్టమైనవి. ఇండియా–చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు. రెండేళ్ల క్రితం భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్‌–చైనా ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావాల్సిన అవసరముందని అస్తానా(కజకిస్తాన్‌)లో జరిగిన భేటీలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబం ధాలకు ప్రజామద్దతును పొందాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇది సాధ్యం కావాలంటే ఇండియా–చైనాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకూడదు’ అని తెలిపారు. ఈ భేటీ వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయి వాంగ్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు