అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఇండియా

7 Jul, 2020 02:47 IST|Sakshi
బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కరోనా కేర్‌ సెంటర్‌

కరోనా పాజిటివ్‌ కేసుల్లో మూడోస్థానానికి భారత్‌ 

దేశంలో ఒక్క రోజులో 24,248 కేసులు.. 425 మరణాలు 

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో రష్యాను దాటేసి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్‌ ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తి ఇలాగే కొనసాగితే త్వరలోనే బ్రెజిల్‌ను కూడా వెనక్కి నెట్టేసి, రెండో స్థానం ఆక్రమించే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియాలో కరోనా కేసులు 7 లక్షలకు, మరణాలు 20 వేలకు చేరువవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,248 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

425 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 6,97,413, మరణాలు 19,693కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 2,53,287 కాగా, 4,24,432 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 60.85 శాతంగా నమోదయ్యింది. అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కరోనా మరణాల విషయంలో ఇండియా ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.  కరోనా

టెస్టులు కోటి
దేశంలో ఇప్పటి వరకు 1,00,04,101 కరోనా టెస్టులు నిర్వహించిన భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్త, మీడియా సమన్వయకర్త డాక్టర్‌ లోకేశ్‌ శర్మ సోమవారం చెప్పారు. ప్రస్తుతం 1,105 ల్యాబ్‌లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ల్యాబ్‌లు 788, ప్రైవేట్‌ ల్యాబ్‌లు 317 ఉన్నాయని పేర్కొన్నారు. గత 14 రోజులుగా నిత్యం 2 లక్షలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నామని అన్నారు. కరోనా టెస్టుల సామర్థ్యం మే 25న 1.5 లక్షలు ఉండగా, ఇప్పుడు 3 లక్షలకు చేరిందని తెలియజేశారు.  

మరిన్ని వార్తలు