అది దురుద్దేశాల నివేదిక

9 Jul, 2019 04:01 IST|Sakshi

కశ్మీర్‌లో పరిస్థితిపై ఐరాస నివేదికపై భారత్‌ మండిపాటు

న్యూఢిల్లీ/జెనీవా: కశ్మీర్‌లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల విభాగం జారీచేసిన నివేదికపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దురుద్దేశాలు, అవాస్తవాలతో కూడిన ఈ నివేదిక.. పాకిస్తాన్‌ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం అనే మూలాంశాన్ని విస్మరించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కశ్మీర్‌లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అటు పాకిస్తాన్‌ లేదా ఇటు ఇండియా ఏ చర్యలూ తీసుకోలేదని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని విస్మరించారు..
‘భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను ఉల్లంఘిస్తూ, కశ్మీర్‌లో మూల సమస్య అయిన సీమాతంర ఉగ్రవాదాన్ని విస్మరిస్తూ ఈ నివేదికను రూపొందించారు. పాక్‌ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదుల వల్ల జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోలేదు. ఇండియాకు, ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించే పాకిస్తాన్‌కు మధ్య కృత్రిమ పోలిక తేవాలన్న ప్రయత్నం ఈ తాజా నివేదికలో కనిపిస్తోంది. దీనిపై ఐరాస మానవహక్కుల కార్యాలయానికి ఇండియా తన తీవ్ర నిరసనను తెలిపింది. నివేదికను ఇలా విడుదల చేయడం వల్ల ఐరాస విశ్వసనీయత, చిత్తశుద్ధి దెబ్బతింది. భారత విధానాలు, ఆచరణలు, విలువలను విస్మరించిన ఈ నివేదిక తన విశ్వసనీయతనే ప్రమాదంలోకి నెట్టుకుంది’ అని చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా