అంతర్జాతీయ టీకా కూటమికి 15 మిలియన్‌ డాలర్లు

5 Jun, 2020 04:44 IST|Sakshi

విరాళంగా ప్రకటించిన భారత ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టీకా కూటమి(గ్లోబల్‌ అలయన్స్‌ ఆఫ్‌ వ్యాక్సిన్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్‌–జీఏవీఐ)కి భారత్‌ తరఫున 15 మిలియన్‌ డాలర్ల(రూ. 113.13 కోట్లు)ను విరాళంగా ప్రధాని మోదీ ప్రకటించారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ నిర్వహించిన గ్లోబల్‌ వ్యాక్సిన్‌ సమ్మిట్‌ను ఉద్దేశించి వీడియో లింక్‌ ద్వారా గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో దాదాపు 50 దేశాలకు చెందిన అధినేతలు, మంత్రులు, ఐరాస సంస్థల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

విపత్తులపై అంతర్జాతీయ సహకారానికి ఉన్న పరిమితులను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘బహుశా తొలిసారి ప్రపంచ మానవాళి ఒక స్పష్టమైన ఉమ్మడి శత్రువుతో పోరాడుతోంది’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ టీకా కూటమి.. ఒక అంతర్జాతీయ సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంఘీభావ ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు. ఇతరులకు సాయం చేయడమంటే మనకు మనం సాయం చేసుకోవడమేనన్న విషయాన్ని ఈ సంస్థ మరోసారి గుర్తు చేస్తోందన్నారు. భారత్‌ వైద్య సదుపాయాలు ఎక్కువగా లేని అత్యధిక జనాభా ఉన్న దేశమని, అందువల్ల టీకా ప్రాముఖ్యత భారత్‌కు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచమంతా ఒకే కుటుంబమని చెప్పే వసుధైక కుటుంబం భావన భారత సంస్కృతిలోనే ఉందని, ఈ కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అదే భావనను భారత్‌ ఆచరిస్తోందని చెప్పారు. ఈ మహమ్మారిపై పోరాటం కోసం దాదాపు 120 దేశాలతో భారత్‌ తన దగ్గరున్న ఔషధాలను పంచుకుందన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదట ప్రారంభించిన పథకాల్లో పిల్లలు,       గర్భిణులు అందరికీ టీకా ఇచ్చే ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ ఒకటని మోదీ గుర్తు చేశారు. టీకాల    తయారీలోనూ భారత్‌ ముందుందని, ప్రపంచంలోని చిన్నారుల్లో దాదాపు 60% మందికి   భారత్‌లో ఉత్పత్తి అయిన టీకాలే అందడం తమకు గర్వకారణమని చెప్పారు.

మరిన్ని వార్తలు