ఉగ్ర మూలాల్ని నాశనం చేశాం

3 Nov, 2019 04:05 IST|Sakshi
బ్యాంకాక్‌లో భారతసంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ

బ్యాంకాక్‌లో భారత సంతతి ప్రజలతో ప్రధాని మోదీ

మూడు రోజుల పర్యటనకు థాయ్‌లాండ్‌ చేరుకున్న ప్రధాని

నేడు, రేపు ఆసియాన్, ఆర్‌సీఈపీపై కీలక భేటీలు

బ్యాంకాక్‌/న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ చేరుకున్న ప్రధాని భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు మూలాలను నాశనం చేశాం. ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ను రద్దు చేశాం. జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగాన్ని కల్పించడం వంటి అనేక తాత్కాలిక నిబంధనలను తొలగించాం. మన నిర్ణయం సరైందే అని ప్రపంచం గుర్తించింది. థాయ్‌లాండ్‌లోనూ అదే విషయం ప్రతిధ్వనించింది.

మీరిచ్చే ప్రశంసలు భారత్‌ పార్లమెంట్, పార్లమెంట్‌ సభ్యులకే చెందుతాయి’అని ప్రధాని పేర్కొన్నారు. దీంతో అక్కడి వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పనిచేసి, ఫలితం చూపేవారి నుంచే ప్రజలు ఎక్కువగా ఆశిస్తారని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన వంటి పథకాలు, కర్తార్‌పూర్‌ కారిడార్‌తో ప్రయోజనాలను ప్రధాని వారికి వివరించారు. ఈ నెల 3వ తేదీన బ్యాంకాక్‌ సమీపంలోని నొంతబురిలో జరిగే ఆసియాన్‌–ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. 4న 14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, ఆర్‌సెప్‌ మూడో శిఖరాగ్ర సమావేశంలోనూ మోదీ హాజరవుతారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర భేటీలో ఆసియాన్‌లోని 10 దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా పాల్గొననున్నాయి.

ప్రయోజనాన్ని బట్టే ఆర్‌సీఈపీ
దేశానికి ఒనగూరే ప్రయోజనాలను బేరీజు వేశాకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్‌సీఈపీ) ఒప్పందంపై సంతకం చేస్తామని మోదీ తెలిపారు. బ్యాంకాక్‌ పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ‘ఈ నెల 4వ తేదీన జరిగే భేటీ సందర్భంగా ఆర్‌సీఈపీ చర్చల్లో పురోగతిని పరిశీలిస్తాం. మన సరుకులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రయోజనాలు ఈ ఒప్పందంతో ఎంతవరకు నెరవేరతాయనే అంశాన్ని పరిశీలిస్తాం. ఈ ఒప్పందం అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఈ శిఖరాగ్రం సందర్భంగా ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తాం. ఆసియాన్‌కు సంబంధించిన ఈ సమావేశాలు మనకు చాలా ముఖ్యం. అనుసంధానత, సామర్థ్యం పెంపు, సాంస్కృతిక, వాణిజ్యపరమైన ప్రాథమ్యాంశాలపై ఆసియాన్‌తో మన భాగస్వామ్యం ఆధారపడి ఉంది’అని తెలిపారు. 

మరిన్ని వార్తలు