యుద్ధవిమానాలతో సెల్ఫీ

8 Jul, 2019 16:39 IST|Sakshi

మాంటే-డీ-మార్సన్‌: భారత్‌కు చెందిన యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్‌ పైలట్‌ నడపగా, ఫ్రాన్స్‌ యుద్ధవిమానం రఫేల్‌ను భారత పైలట్‌ నడిపారు. అంతేనా ఈ ఇద్దరు పైలట్లు యుద్ధవిమానాలని నడుపుతూ దిగిన సెల్ఫీలను ఇరుదేశాల వైమానిక విభాగాలు ట్వీట్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నాయి. ఈ అరుదైన సంఘటన ఫ్రాన్స్‌లోని మాంటే-డీ-మార్సన్‌ ఎయిర్‌బేస్‌లో చోటుచేసుకుంది. భారత్‌, ఫ్రాన్స్‌ దేశాల మధ్య జులై 1 నుంచి 14 వరకు గరుడ-6 పేరిట ఇరుదేశాలకు చెందిన యుద్ధ విమానాల సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్‌ అత్యున్నత యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్‌ ఫైలట్‌ నడపగా, భారత్‌ కొనుగోలు చేస్తున్న రఫేల్‌ను భారత ఫైలట్‌ నడిపారు.

ఈ విన్యాసాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఫ్రాన్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల మధ్య మంచి అవగాహన కుదిరిందని, తమ సామర్థ్యాలను మరింత మెరుగపర్చుకోవడానికి అవకాశం కలిగిందని పేర్కొంది. అంతేగాక రెండు దేశాల సైనికుల మధ్య కూడా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపింది. భారత్‌, ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలుచేసిన విషయం తెలిసిందే. అయితే రఫేల్‌ కొనుగోలులో అవినీతి జరిగిందంటూ భారత్‌లో తీవ్ర రాజకీయదుమారం రేగినా ప్రభుత్వం రఫేల్‌ను కొనడానికే సిద్దపడింది.

ఇప్పటికే భారత్‌ దగ్గర నాలుగు సుఖోయ్‌-30లను కలుపుకొని మొత్తం 124 యుద్దవిమానాలు ఉన్నాయి. ఇప్పుడు రఫేల్‌ వచ్చి చేరితే భారత వాయుసేన మరింత శక్తివంతం కానుంది. సెప్టెంబర్‌19 నాటికి తొలి రఫేల్‌ను భారత్‌కు ప్రాన్స్‌ ఇవ్వనుంది. మిగతా వాటిని రెండు సంవత‍్సరాలలోపు ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ విన్యాసాలు భారత్‌ ఫైటర్లకు రఫేల్‌పై అవగాహన కల్పిస్తాయని, అలాగే భారత ఫైటర్లకు అంతర్జాతీయ వాతావరణంపై అవగాహన కలగడమేగాక రష్యా తయారీ భారత సుఖోయ్‌ని యుద్ధ క్షేత్రంలో రఫేల్‌తో అనుసంధానించడంపై వీరికి నైపుణ్యం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రష్యా తయారీ అత్యున్నత యుద్ధ విమానం సుఖోయ్‌ భారత్‌ తరపున ఫ్రాన్స్‌ గగనతలంపై చక్కర్లు కొట్టడమేగాక, ఒక ఫ్రెంచ్‌ ఫైటర్‌ ఆ విమానాన్ని నడపడం ఆసక్తికరవిషయమని అంటున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా