అమెరికాకు షాక్ ‌: దిగుమతి సుంకం పెంపు

21 Jun, 2018 14:09 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ట్రేడ్‌వార్‌తో ప్రపంచ వాణిజ్య రంగాన్ని వణికిస్తున్న అమెరికాకు షాకిచ్చేలా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికానుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై  దిగుమతి సుంకాన్ని పెంచింది.  సుంకం పెంపు ఆగస్టు 4 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూనిమియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలను పెంచిన నేపథ్యంలో భారత్‌  ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.  ముందు  ప్రకటించినట్టుగా గాకుండా మొత్తం 29 వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్టు వెల్లడించింది.  800 సిసి పైన మోటారు బైక్లను మినహాయించి, ప్రస్తుతం 29 వస్తువులపై అదనపు కస్టమ్స్ సుంకం  విధిస్తున్నట్టు  తెలిపింది.  ఇందులో కొన్ని రకాల నట్స్‌, యాపిల్స్‌, ఇనుము, స్టీలు, అల్లోయ్‌ ఉత్పత్తులు, బోరిక్ యాసిడ్, బోల్టులు, నట్లు, స్క్కూలు తదితరాలు ఉన్నాయి.

చిక్కుళ్లు, శనగల దిగమతిపై సుంకాన్ని 60శాతానికి పెంచింది.  ఇతర గింజధాన్యాలపై 30 శాతానికి, బోరిక్‌యాసిక్‌, ఫౌండరీ  మౌల్డ్స్‌ బైండర్ల 7.5 శాతం పెంచింది.  రొయ్యలు ఇతర సీ ఫుడ్‌పై 15 శాతం సుంకం పెంచింది. ప్రపంచ వాణిజ్య సంస్థ డాక్యుమెంట్‌కు లోబడి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచే అధికారం ఉందని ఈ ఏడాది మే 18న భారత్ తెలియచేసింది. మార్చి 9న అమెరికా సుంకాలు పెంచడం వల్ల మన దేశానికి చెందిన స్టీలు ఎగుమతిదార్లపై రూ.1198.6 మిలియన్ డాలర్లు, అల్యూమినియం ఎగుమతిదార్లపై 42.4 మిలియన్ డాలర్ల ప్రభావం పడింది. అలాగే దీనివల్ల భారత్‌పై 241 మిలియన్ డాలర్ల ప్రభావం పడిన సంగతి తెలిసిందే.

కాగా ప్రతి ఏడాది  1.5 బిలియన్ డాలర్ల విలువైన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2016-17లో భారత్ ఎగుమతులవిలువ 42.21 బిలియన్ డాలర్లుగాను, దిగుమతులు 22.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు