అమెరికా ఒత్తిడితోనే..

28 Jun, 2018 16:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా నుంచి ఎదురైన ఒత్తిళ్ల మేరకే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతుల్లో భారత్‌ కోత విధిస్తోందని భావిస్తున్నారు. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖకు ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలన్న అమెరికా ఒత్తిడికి భారత్‌ తలొగ్గిందనేందుకు ఇవి తొలి సంకేతాలని పరిశ్రమ వర్గాలు సైతం భావిస్తున్నాయి. అమెరికా ఏకపక్షంగా విధించిన నియంత్రణలను గుర్తించబోమని, ఐరాస ఆంక్షలను మాత్రం అనుసరిస్తామని భారత్‌ చెబుతోంది. అయితే అమెరికా ఒత్తిడి మేరకే చైనా తర్వాత అత్యధికంగా చమురు దిగుమతుల కోసం ఇరాన్‌పై ఆధారపడుతున్న భారత్‌ ఈ విషయంలో పునరాలోచిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థతో మన ప్రయోజనాలు పెనవేసుకున్న నేపథ్యంలోనూ భారత్‌ ఈ తీరుగా వ్యవహరిస్తోందని చెబుతున్నాయి. మరోవైపు ఇరాన్‌ చమురుకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని గురువారం రిఫైనర్లతో భేటీ అయిన చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.గతంలో ఐరాస, యూరప్‌ ఆంక్షల నేపథ్యంలోనూ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను భారత్‌ గణనీయంగా తగ్గించింది.

అయితే ఈసారి పూర్తిగా ఇరాన్‌ చమురు దిగుమతులను నిరోధించాలన్న నిర్ణయంతో పరిస్థితిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హాలీ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు.

మరిన్ని వార్తలు