ఎన్నికల ముందు మతఘర్షణలు!

31 Jan, 2019 03:21 IST|Sakshi
అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ డాన్‌ కోట్స్‌

ముస్లింలపై దాడులు పెరిగితే ఇస్లామిక్‌ ఉగ్రసంస్థలకు ఊతం

అమెరికా సెనెట్‌ కమిటీకి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కోట్స్‌ నివేదిక  

వాషింగ్టన్‌: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళితే భారత్‌లో మతఘర్షణలు చెలరేగే అవకాశముందని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ డాన్‌ కోట్స్‌ తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు, విద్వేషం పెరిగాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఎదురుకానున్న విపత్కర పరిస్థితులపై కోట్స్‌ సెనెట్‌ సెలక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటెలిజెన్స్‌ ముందు హాజరై నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కోట్స్‌ మాట్లాడుతూ..‘మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ అజెండాను ప్రచారాస్త్రంగా చేసుకుంటే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముంది. దాంతో,  ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలు భారత్‌లో సులభంగా తమ ప్రాబల్యాన్ని విస్తరిస్తాయి’ అని హెచ్చరించారు.  

భారత్‌పై ఉగ్రదాడులు కొనసాగుతాయి..
అంతేకాకుండా భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలు లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ మెరుగుపడే అవకాశం లేదని కోట్స్‌ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్, అఫ్గానిస్తాన్‌పై 2019లోనూ దాడులు కొనసాగిస్తాయని హెచ్చరించారు. తమకు ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదులను మాత్రమే ఏరివేస్తూ, ఇతర ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌ అమెరికా ఆగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై పోరాడుతున్న అమెరికాకు పాక్‌ వ్యవహారశైలి నిరాశపరుస్తోందన్నారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మత ఉద్రిక్తతలు, అఫ్గానిస్తాన్‌లో 2019, జూన్‌–జూలై నెలల్లో అధ్యక్ష ఎన్నికలు సందర్భంగా తాలిబాన్ల దాడులు, ఉగ్రవాదుల పూర్తిస్థాయి ఏరివేతకు పాక్‌ నిరాకరణ వంటి కారణాల వల్ల ఈ ఏడాది దక్షిణాసియాలో హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. సెనెట్‌ సెలక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటెలిజెన్స్‌ ముందు కోట్స్‌తో పాటు సీఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్, ఎఫ్‌బీఐ చీఫ్‌ క్రిస్టోఫర్‌ రే, రక్షణ నిఘా సంస్థ(డీఐఏ) డైరెక్టర్‌ రాబర్ట్‌ అష్లేతో పాటు పలువురు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు