కశ్మీర్‌ సమస్యకు చర్చలే పరిష్కారం

22 Aug, 2018 01:49 IST|Sakshi

అన్ని సమస్యలకూ అదొక్కటే మార్గం: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలంటే చర్చల ద్వారానే సాధ్యపడుతుందని పాకిస్తాన్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. భారత ఉపఖండంలో పేదరికాన్ని నిర్మూలించి, ప్రజల ఉన్నతికి తోడ్పడాలంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా విభేదాలను తొలగించి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రారంభించాలని మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘పాకిస్తాన్, భారత్‌లు ముందుకు సాగాలంటే కశ్మీర్‌ అంశం సహా ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా తొలగించుకోవాలి’ అని పేర్కొన్నారు.

ఇరుగుపొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకునేందుకు పనిచేస్తామని, సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించారు. భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉందని, కశ్మీర్‌ వంటి కీలక అంశాలతో పాటు అన్ని విభేదాలను పరిష్కరించేందుకు ఇరు దేశాల నేతలు చర్చలు జరపడం అవసరం అని పేర్కొన్నారు.  

సిద్ధూకు మద్దతుగా..
పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుగా నిలిచారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాను సిద్ధూ ఆలింగనంచేసుకోవడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. సిద్ధూను విమర్శిస్తున్న వారంతా భారత ఉపఖండంలో శాంతికి అపకారం చేస్తున్నట్లే అని ఇమ్రాన్‌ ట్విట్టర్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘నా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్‌కు వచ్చినందుకు సిద్ధూకు ధన్యవాదాలు. ఆయన శాంతికి రాయబారి. పాకిస్తాన్‌ ప్రజలు సిద్ధూపై ఎనలేని ప్రేమ, ఆప్యాయతలు చూపించారు’ అని ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు.

రాజకీయ ఆలింగనం కాదు
బజ్వాను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నానని, దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని సిద్ధూ వివరణ ఇచ్చారు. గురుదాస్‌పూర్‌ జిల్లాలోని డేరాబాబా నానక్‌ నుంచి కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వరకు యాత్రికుల కోసం కారిడార్‌ ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు బజ్వా పేర్కొన్నారని, వెంటనే భావోద్వేగంతో ఆయనను ఆలింగనం చేసుకున్నానని తెలిపారు.  

మరిన్ని వార్తలు