ప్రమాదంలో భారత్‌.. అమెరికా సైతం!

10 Jan, 2020 12:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ రాజకీయ పరిస్థితులపై అమెరికాలోని ఓ కన్సల్టెన్సీ అధ్యయనం చేసింది. 2020 సంవత్సరంలో భారత్‌ రాజకీయంగా ప్రమాదకర దేశాల జాబితాలో కొనసాగనుందని తెలిపింది. సదరు అధ్యయనం ప్రకారం.. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారాన్ని చేపట్టాక ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని పేర్కొంది. ఇక రాజకీయంగా ప్రమాదకర పరిస్థితులున్న దేశాల జాబితాలో అమెరికా ముందు వరుసలో ఉంది. ఎన్నికల సమయం నుంచే అమెరికా అనేక సంచలనాలకు వేదికయ్యింది. అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం, మరెన్నో సంఘటనలు అమెరికా చరిత్రలో చోటు చేసుకున్నాయని తెలిపింది. సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో అమెరికా, చైనా పోటీ ధోరణి.. విలువలు, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డాయి.

భారత్‌ విషయానికొస్తే ఆర్థిక మాంద్యంతో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడంలో ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిందని తెలిపింది. ఆరేళ్ల కనిష్టానికి వృద్ది రేటు 4.5శాతం పడిపోయినప్పటికీ భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉందని వెల్లడించింది. సాంకేతిక వ్యవస్థలో పోటీ కారణంగా అన్ని దేశాలు భద్రత సమస్యలు ఎదుర్కొంటాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు జాతీయవాద భావనలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో బహుళ జాతి సంస్థల(ఎమ్‌ఎన్‌సీ)కు కఠిన నిబంధనలు రూపొందిస్తున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో వాతావరణ సమస్యలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు