'పాక్, చైనాలపై దాడి కోసమే రఫేల్ విమానాలు'

30 Sep, 2016 12:13 IST|Sakshi
'పాక్, చైనాలపై దాడి కోసమే రఫేల్ విమానాలు'

రఫేల్ యుద్ధ విమానాలను భారత దేశం ఎందుకు కొనుగోలు చేస్తోంది.. తమ అణ్వస్త్రాలను పాకిస్థాన్, చైనాల మీద ప్రయోగించడానికేనా? అందుకేనని చైనా మీడియా అంటోంది. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్లలో భారతదేశమే అగ్రగామిగా ఉందని చెబుతోఉంది. రఫేల్ జెట్ విమానాలకు అణు వార్‌హెడ్లను తీసుకెళ్లగల సామర్థ్యం ఉందని, అంటే భారత అణ్వస్త్ర సామర్థ్యం మరింత పెరుగుతుందని గ్లోబల్ టైమ్స్ అనే పత్రికలో ప్రచురించిన కథనంలో పేర్కొన్నారు. భారత్ దాదాపు రూ. 85వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అందే ఈ విమానాలతో పాకిస్థాన్, చైనాలలో ఉన్న లక్ష్యాలపై భారత భూభాగం నుంచే దాడులు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం భారత వైమానిక దళంలో 33 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ప్రతిదాంట్లో 18 చొప్పున యుద్ధవిమానాలున్నాయి. కానీ.. చైనా, పాకిస్థాన్ రెండు దేశాల నుంచి ఉన్న ముప్పును ఎదుర్కోవాలంటే కనీసం 45 యుద్ధ యూనిట్లు కావాల్సి ఉంటుందని అంచనా. 'చైనా బూచి'ని చూపించి తమ ఆయుధ సంపత్తిని పెంచుకోడానికి భారతదేశంతో సహా చైనా పొరుగుదేశాలు ప్రయత్నిస్తున్నాయని గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది.

నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలోనే ఈ కథనం వెలువడటం విశేషం. ఈ దాడుల గురించి చైనా ఇంతవరకు స్పందించలేదు. ఇన్నాళ్లూ పాకిస్థాన్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్న చైనా దీనిపై స్పందించకపోవడం ఒకరకంగా పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బే అవుతుంది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోనే రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశం మోహరిస్తుందని అంచనా వేస్తున్నట్లు చైనా పత్రిక పేర్కొంది. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 6.66 లక్షల కోట్ల రూపాయలను ఆయుధాల కొనుగోలుకు, సైనిక సామర్థ్యాన్ని పెంచుకోడానికి ఖర్చుపెట్టారని ఆ కథనంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. భారతదేశంతో పాటు వియత్నాం, దక్షిణ కొరియా కూడా టాప్ 10 ఆయుధాల కొనుగోలుదారుల్లో ఉన్నాయని చెప్పారు.

>
మరిన్ని వార్తలు