ఉగ్రవాదంపై నిష్పాక్షిక పోరు

10 Jul, 2015 01:07 IST|Sakshi
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సమావేశమైన బ్రిక్స్ దేశాధినేతలు నరేంద్ర మోదీ, జిన్‌పింగ్, జాకబ్ జూమా, దిల్మా రౌసెఫ్, పుతిన్

బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు
* అంతర్జాతీయ నిబంధనలను  కచ్చితంగా పాటించాలి
* ఐరాస భద్రతమండలిలో సంస్కరణలు ఆవశ్యకం

ఉఫా(రష్యా): స్వ, పర భేదం లేకుండా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని బ్రిక్స్ దేశాలకు భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాద గ్రూపులు, వాటికి సాయమందిస్తున్న దేశాలు, ఉగ్రవాదం లక్ష్యంగా చేసుకున్న దేశాలపై ఎలాంటి భేదభావం చూపకూడదని హితవు చెప్పారు.

బ్రిక్స్, ఐరాస భద్రతామండలితో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా ఇదే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అంతర్జాతీయ నియమ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాలన్నారు. సామాజిక, ఆర్థికాభివృద్ధికి శాంతి, సుస్థిరతలు మూల స్తంభాలని పేర్కొన్నారు. రష్యాలోని ఉఫాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో గురువారం మోదీ ప్రసంగించారు. చైనా అధ్యక్షుడు పింగ్, బ్రెజిల్ అధ్యక్షురాలు  రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమాల సమక్షంలో ఉగ్రవాదంపై భారత వైఖరిని, ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన విధానాల్ని మోదీ వివరించారు.

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్‌పై చర్యకు అవసరమైన సమాచారం భారత్ ఇవ్వలేదంటూ ఐరాసలో భారత ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.

‘ఐరాస ఎలాంటి సామాజిక, ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనే స్థాయికి రావాలంటే ముందుగా, అతిత్వరగా భద్రతమండలిలో సంస్కరణలు రావాలి’ అన్నారు. అంతర్జాతీయంగా కీలక ఆర్థిక వ్యవస్థలైన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు.. ఏకాభిప్రాయం,  సహకారంతో సవాళ్లు ఎదుర్కోవాలన్నారు. బ్రిక్స్ బ్యాంక్ వచ్చే సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, తర్వాత విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని పుతిన్ తెలిపారు.
 బ్రిక్స్ డిక్లరేషన్.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజకీయ వ్యూహాలు, పక్షపాత ధోరణి ఉండకూడదని బ్రిక్స్ డిక్లరేషన్ స్పష్టం చేసింది.  

పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఉగ్రవాదంపై పోరులో పక్షపాత వైఖరి అవలంబిస్తున్న పాక్‌ను ఉద్దేశించే ఈ ప్రకటన అని, ఇది భారత్ సాధించిన విజయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సమన్వయం చేయాలని ఆ డిక్లరేషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ స్టేట్ దురాగతాలను కూడా అందులో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై బ్రిక్స్ సదస్సు చర్చించింది.
 
నేడు మోదీ, షరీఫ్‌ల భేటీ.. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సుల నేపథ్యంలో.. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు నేడు(శుక్రవారం) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కశ్మీర్‌పై పాక్ వ్యాఖ్యలు, బంగ్లాదేశ్‌లో మోదీ పాక్ వ్యతిరేక కామెంట్లతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చే చర్యలపై మోదీ, షరీఫ్‌లు చర్చించనున్నారు. అలాగే, ఉగ్రవాదం, ఇతర సీమాంతర కార్యక్రమాలపై షరీఫ్‌కు మోదీ తీవ్ర నిరసన తెలిపే అవకాశం ఉంది. బ్రిక్స్, ఎస్‌సీఓ సభ్య దేశాధినేతలకు గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన విందులో మోదీ, షరీఫ్‌లు ఎదురుపడ్డారు. నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న దాయాది దేశాల ప్రధానులు కాసేపు ముచ్చటించుకున్నారు. రష్యాలో ఇరాన్ అధ్యక్షుడు రౌహనీతో మోదీ భేటీ అయ్యారు.
 
సహకారానికి పది సూత్రాలు

బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం సమన్వయం పెంపొందాలని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో ‘దస్ కదమ్: భవిష్యత్తుకు పది అడగులు’ పేరుతో పది సూత్రాలను ప్రతిపాదించారు. వీటిలో   వాణిజ్య ప్రదర్శన, రైల్వే పరిశోధన కేంద్రం, ప్రధాన ఆడిట్ సంస్థల మధ్య సహకారం, బ్రిక్స్ క్రీడా మండలి తదితరాలు ఉన్నాయి. కాగా, ఏకపక్ష ఆంక్షలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ  బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు