ఆకలి రాజ్యం

19 Nov, 2016 19:34 IST|Sakshi
ఆకలి రాజ్యం

► భారత్‌లో ఆందోళనకరంగా ఆకలి  ప్రపంచ ఆకలి సూచీ వెల్లడి
► దేశంలో 15 శాతం మంది చిన్నారుల అర్థాకలి
► ప్రతి 20 మంది పిల్లల్లో ఒకరు ఐదేళ్ల లోపే మృతి
► భారత్‌కన్నా బంగ్లా, శ్రీలంక, కెన్యా, ఇరాక్‌లే బెటర్‌


ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థికవ్యవస్థ భారతదేశం. ప్రపంచ వేదికలపై పాలకులు ఈ విషయాన్ని ఎంతో గర్వంగా ప్రకటిస్తున్నారు. ఇండియా అతి త్వరలో ‘సూపర్‌పవర్‌’గా అవతరిస్తుందని ఎంతో ధీమాగా చెప్తున్నారు. కానీ.. అదే సమయంలో దేశంలో పేదల ఆకలి కేకలు పెద్దగా తగ్గుతున్న దాఖలాలు లేవు. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పిఆర్ఐ) ఇటీవల విడుదల చేసిన 2016 ప్రపంచ ఆకలి సూచీలో (గ్లోబల్‌హంగర్‌ఇండెక్స్‌ జీహెచ్‌ఐ).. మొత్తం 118 దేశాల జాబితాలో భారతదేశం అట్టడుగున 97వ స్థానంలో ఉంది. దేశంలో ఆకలి ఆందోళనకర స్థాయిలో ఉందని ఈ సూచీ చెప్తోంది.

ఐదేళ్ల లోపే అర్థంతర మరణం: భారతదేశంలో ఐదేళ్ల వయసు లోపున్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు పూర్తిగా ఎదగడం లేదు. ప్రతి 20 మందిలో ముగ్గురు పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు పెరగడం లేదు. ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు ఐదేళ్లు నిండకముందే చనిపోతున్నారు. దీనికి కారణం వారికి తగినంత ఆహారం లభించకపోవడమే.

పొరుగు దేశాలు ఎంతో మెరుగు: ఆకలి సూచీ సర్వే ప్రకారం.. భారత్‌కన్నా కెన్యా, మలావి, ఇరాక్‌వంటి దేశాల్లో మెరుగైన పరిస్థితి ఉంది. పొరుగు దేశాల్లో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌లు కూడా భారత్‌కన్నా మెరుగుగానే ఉంటే.. ఒక్క పాకిస్తాన్‌మాత్రమే భారత్‌కన్నా కొంత వెనుకబడి ఉంది. ఇక చైనాలో ఆకలి నామమాత్రంగానే ఉంది. భారతదేశం శిశు మరణాల రేటులో కనీసం శ్రీలంక స్థాయిని చేరుకోగలిగితే.. 2016లో జన్మించిన శిశువుల్లో సుమారు 9 లక్షల మంది 2021 లోపే చనిపోకుండా కాపాడవచ్చు.

పేదల ఆకలికి లేదు ప్రాధాన్యం
దేశంలో పేదల ఆకలి, ప్రజారోగ్యం అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో కానీ, ప్రచారంలో కానీ, పార్లమెంటు లోపల కానీ, వెలుపల కానీ, రాజకీయ పార్టీల విధానాల్లో కానీ, వాదనల్లో కానీ, ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకునే విషయాల్లో కానీ.. పొరుగుదేశంతో సంబంధాలు, ఉగ్రవాదం, అభివృద్ధి, అవినీతి, నల్లధనం వంటి అంశాల స్థాయిలో.. ఈ కీలకాంశాలకు పెద్దగా చోటు లభించడం లేదని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.

ఆదివాసీలు, దళితులే అధికం: ఆహార లోపంతో అలమటిస్తున్న, అర్థంతరంగా చనిపోతున్న చిన్నారుల్లో అత్యధికులు ఆదివాసీలు, దళితులు, ఇతర వెనుకబడ్డ కులాల వారేనని ఎకానమిక్‌అండ్‌పొలిటికల్‌వీక్లీ 2011లో ప్రచురించిన ఒక అధ్యయనం చెప్తోంది. దాని ప్రకారం.. అగ్ర కులాల చిన్నారులతో పోలిస్తే.. ఎదుగుదల లోపం ఆదివాసీ చిన్నారుల్లో 69 శాతం, దళిత చిన్నారుల్లో 53 శాతం, ఇతర వెనుకబడిన కులాల వారిలో 35 శాతం అధికంగా ఉంది.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: ఇదే ఆకలి సూచీలో 2000 సంవత్సరంలో భారత్‌కన్నా బంగ్లాదేశ్‌ఒక స్థానం దిగువనే ఉంది. కేవలం 15 సంవత్సరాల్లో భారత్‌ను బంగ్లా ఏడు స్థానాలు అధిగమించి ముందుకు సాగింది. 2000 సూచీలో భారత్‌కన్నా కేవలం ఆరు స్థానాలు మెరుగుగా ఉన్న నేపాల్‌ఇప్పుడు ఏకంగా 25 స్థానాలు మెరుగుపడింది.

కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘భారతదేశపు పోషకాహార సవాళ్లపై ప్రధానమంత్రి మండలి’ని ఏర్పాటు చేసింది. ఆ మండలి దేశంలో పోషకాహారం పరిస్థితిపై పీఎంఓకు త్రైమాసిక నివేదికలు అందించాల్సి ఉంది. కానీ అది ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక్కసారి సమావేశమైంది.
 
నాలుగు దశాబ్దాలుగా ఉన్న జాతీయ పోషకాహార పర్యవేక్షణ బ్యూరో (ఎన్‌ఎన్‌ఎంబి)ని ఎన్‌డీఏ ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసింది. ఆ సంస్థ పోషకాహార సర్వేలు నిర్వహించినా ఆ నివేదికలను ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలున్నాయి.

అన్నార్తుల్లో అగ్రస్థానం...
2015లో ఐక్యరాజ్యసమితి సంస్థలు విడుదల చేసిన ఆహార అభద్రత నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అర్థాకలితో అలమటిస్తున్న వారు అత్యధికంగా భారతదేశంలోనే ఉన్నారు. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో పాకిస్తాన్‌ ఉన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా 79.46 కోట్ల మంది అర్థాకలితో జీవిస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచ జనాభాలో 11 శాతం.
సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌

 

మరిన్ని వార్తలు