నేపాల్‌లో స్కూళ్ల నిర్మాణానికి భారత్‌ సాయం!

8 Jun, 2020 20:55 IST|Sakshi

నేపాల్‌లో 56 పాఠశాలల పునర్‌నిర్మాణానికి భారత్‌ సాయం!

ఖాట్మండూ: నేపాల్‌లో 56 ఉన్నత పాఠశాలల పునర్నిర్మాణానికై సహాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. భూకంపాల తాకిడి కారణంగా శిథిలావస్థకు చేరిన 7 జిల్లాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 2.95 బిలియన్‌ నేపాలీ రూపాయల గ్రాంట్‌ ప్రకటించింది. ఈ మేరకు.. ‘‘నేపాల్‌లోని గోర్ఖా, నౌవాకోట్‌, ధాడింగ్‌, డోలఖా, కావ్రేపాలన్‌చౌక్‌, ఆమెచాప్‌, సింధుపాల్‌చౌన్‌ జిల్లాల్లోని 56 పాఠశాలల పునర్నిర్మాణానికై... భారత రాయబార కార్యాలయం, నేపాల్‌ విద్యాశాఖకు చెందిన సెంట్రల్‌ లెవల్‌ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌(సీఎల్‌పీఐయూ) మధ్య ఏడు ఎంఓయూలు కుదిరాయి’’ అని నేపాల్‌లోని ఇండియన్‌ మిషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. వివిధ సామాజిక, ఆర్థిక అంశాల్లో నేపాల్‌కు ఎల్లప్పుడూ భారత్‌ మద్ధతుగా ఉంటుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంది.  (భారత్‌తో ఏకాభిప్రాయం కుదిరింది: చైనా)

కాగా 2015లో తీవ్రమైన భూకంపాల వలన నేపాల్‌లోని పలు జిల్లాల్లో వేలాది స్కూళ్లు కుప్పకూలిపోయాయి. ఈ క్రమంలో దశల వారీగా స్కూళ్లను నిర్మిస్తున్నారు. తరగతి గదులు, ఫర్నీచర్‌, బాలబాలికలకు వేర్వేరుగా వాష్‌రూంలు తదితర నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారత్‌లోని రూర్కీకి చెందిన సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నేపాల్‌కు సాంకేతిక సాయం అందించనుంది. ఇక భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పునురుద్ధరణ చర్యల్లో భాగంగా భారత్‌ నేపాల్‌కు 1 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 150 మిలియన్‌ డాలర్లు గృహనిర్మాణ రంగానికి, 100 మిలియన్‌ డాలర్లు గ్రాంట్‌ల రూపంలో, 50 మిలియన్‌ డాలర్లు లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద కేటాయించారు.

మరిన్ని వార్తలు