ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చిన భారత్‌

28 Sep, 2019 10:10 IST|Sakshi

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పింది. అణు యద్ధమంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఓ దౌత్యవేత్తలా కాకుండా యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా పాక్‌ ప్రధాని మాట్లాడారంటూ భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వక్ర బుద్ధిని ఇమ్రాన్‌ స్వయంగా అంతర్జాతీయ వేదిక మీద తానే ప్రదర్శించారంటూ ఎద్దేవా చేసింది. పాక్‌ ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారింది వాస్తవం కాదా అని భారత్‌ ప్రశ్నించింది. తమ దేశానికి ఉగ్రసంస్థలతో ఎలాంటి సంబంధం లేదని పాక్‌ నిరూపించగలదా అంటూ సవాల్‌ చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్‌ కశ్మీర్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మొదటి కార్యదర్శి విదిషా మైత్రా శనివారం స్పందించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ దౌత్యవేత్తలా కాకుండా.. యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరించడం సరైంది కాదన్నారు మైత్రా.

(చదవండి: కర్ఫ్యూ తొలగిస్తే రక్తపాతమే)

అంతేకాక పాక్‌ ప్రధాని ప్రసంగం విభజనను, విభేదాలను పెంచేలా, ద్వేషాన్ని రెచ్చగొట్టెలా ఉందని పేర్కొన్నారు మైత్రా. ఇమ్రాన్‌ తన ప్రసంగంలో పేర్కొన్న రక్తపాతం, హింసాకాండ, జాతిఆధిపత్యం, తుపాకీని తీయడం వంటి మాటలు 21వ శతాబ్దపు ఆలోచనలను కాకుండా మధ్యయుగపు నియంతృత్వ భావాలను ప్రతిబింబించేలా ఉన్నాయన్నారు మైత్రా. తమ దేశంలో ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా లేదని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వాస్తవమే అని ఐక్యరాజ్యసమితి పరిశీలకుడి చేత ఇమ్రాన్‌ చెప్పించగలరా అంటూ మైత్రా ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోని అల్‌ ఖైయిదా ఉగ్రవాదికి పెన్షన్‌ అందించే ఏకైక దేశం పాకిస్తాన్‌ అన్నారు. దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా లేదా అని మైత్రా ప్రశ్నించారు.

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయకపోతే.. న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంక్ను ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాకిస్తాన్ వివరించగలదా.. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఎందుకు పాక్‌ను నోటీసులో పెట్టిందో ప్రపంచ దేశాలకు తెలపగలదా.. ఒసామా బిన్‌ లాడెన్‌కు పాక్‌ బహిరంగ రక్షకుడని ఇమ్రాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించగలరా.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన జాబితాలోని 135 మంది ఉగ్రవాదులకు, 25 ఉగ్ర సంస్థలకు ఆ దేశం ఆశ్రయం ఇవ్వడం నిజం కాదా.. యూఎన్‌ విడుదల చేసిన జాబితాలోని అల్‌ ఖయిదా ఉగ్రవాదికి పాక్‌ పెన్షన్‌ ఇవ్వడం వాస్తవం కాదా.. ఈ అంశాలను ఇమ్రాన్‌ ఖండించగలరా అంటూ విదిషా మైత్రా ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాక  భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి, ఇమ్రాన్‌ ప్రసంగానికి ఎంతో తేడా ఉందన్నారు. మోదీ తన ప్రసంగంలో శాంతి, అహింస సందేశాన్ని ఇస్తే..  ఇమ్రాన్‌ యుద్ధానికి సిద్ధం అనే సందేశాన్ని ఇచ్చి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని పేర్కొన్నారు  విదిషా మైత్రా.
(చదవండి: చైనాలో ముస్లింల బాధలు పట్టవా?)

భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని కవ్విస్తూ... రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధమే వస్తే.. దాని విపరిణామాలు సరిహద్దులు దాటి విస్తరిస్తాయని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ సమాజంపై బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు