ఇది మా అంతర్గత విషయం: భారత్‌

6 Aug, 2019 20:51 IST|Sakshi

బీజింగ్‌: లఢఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా విడదీయడం పట్ల చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధీటుగా స్పందించింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. భారత్‌ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని.. అలానే ఆయా దేశాలు కూడా అలానే ప్రవర్తిస్తే మంచిదని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు అంశాలపై చైనా నేడు స్పందించింది. భారత్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని చైనా హితవు పలికింది. అయితే ఈ అంశంలో చైనా సలహా అక్కర్లేదని భారత్‌ స్పష్టం చేసింది. అలానే భారత్‌ - చైనాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాలు ఆమోదయోగ్యమైన, మార్గదర్శమైన పరిష్కారం కోసం కృషి చేయాలని విదేశాంగ శాఖ పేర్కొంది.

జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది.

>
మరిన్ని వార్తలు