పాక్‌ మాకు పాఠాలు చెబుతుందా?

11 Mar, 2018 03:35 IST|Sakshi

ఐరాసలో కశ్మీర్‌పై పాక్‌ వాదనను ఎండగట్టిన భారత్‌

జెనీవా : కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐరాసలో పాక్‌ చేసిన ఆరోపణలను భారత్‌ సమర్థవంతంగా ఎండగట్టింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్‌ ఒక ‘విఫల దేశం’అనీ, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గత్యంతరం తమకు లేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాక్‌ ఆరోపణలకు ఐరాసలో భారత సహాయ కార్యదర్శి మినీదేవి కుమమ్‌ స్పందించారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అసలైన మానవహక్కుల ఉల్లంఘన అని అన్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన అంటూ పాఠాలు చెప్పే ముందు అక్కడ ఉగ్రవాదానికి ఊతమివ్వటం మానాలనీ, ముంబై, పఠాన్‌కోట్, ఉదీ దాడులకు కారకులను గుర్తించి, శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌కు రక్షణ కల్పించిన పాక్‌లో హఫీజ్‌ సయీద్‌ వంటి ఎందరో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని ఆమె అన్నారు.

ఐరాసలో పాకిస్తాన్‌ శాశ్వత సహాయ ప్రతినిధి తాహిర్‌ అంద్రాబీ మాట్లాడుతూ..భారత ప్రభుత్వం కశ్మీర్‌ను ఆక్రమించుకుని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు