కశ్మీర్‌పై జోక్యాన్ని సహించం

11 Sep, 2019 04:47 IST|Sakshi

అది సార్వభౌమాధికార నిర్ణయం

ఐరాస మానవ హక్కుల సంఘం భేటీలో భారత్‌ స్పష్టీకరణ

జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతి పత్తి రద్దు నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని భారత్‌ స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది. కశ్మీర్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ జెనీవాలో మంగళవారం జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్చార్సీ) 42వ సమావేశంలో పాకిస్తాన్‌ కోరిన నేపథ్యంలో భారత్‌ ఈ విషయం స్పష్టం చేసింది. ఐరాస మానవ హక్కుల సంఘంలో కశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్‌ చేస్తున్నదంతా దుష్ప్రచారమని కొట్టిపారేసింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) విజయ ఠాకూర్‌ సింగ్‌ జెనీవాలో మాట్లాడుతూ.. మానవహక్కుల ముసుగులో రాజకీయ దుష్ప్రచారానికి ఐరాసను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఇతర దేశాల్లో మైనారిటీలకు మానవ హక్కులు లేవంటూ మాట్లాడుతున్న వారు సొంత దేశంలో మైనారిటీలను అణగదొక్కుతున్నారు’ అని అన్నారు. ‘కశ్మీర్‌కు సంబంధించి ఇటీవల చేపట్టిన మార్పులు భారత రాజ్యాంగానికి లోబడి జరిగాయి. భారత పార్లమెంట్‌ కూలంకషంగా చర్చించి తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అంతరంగిక విషయం’అని పేర్కొన్నారు. ఇతర దేశాల జోక్యాన్ని భారత్‌ అంగీకరించబోదన్నారు. ఇదే విషయాన్ని ఆయన మానవహక్కుల సంఘం చీఫ్‌ మిఛెల్‌ బాచెలెట్‌కు వివరించారు. సీమాంతర ఉగ్రవాదం బెడద కారణంగానే ఆంక్షలు విధించినట్లు వివరించారు. 130 కోట్ల జనాభా కలిగిన తమ దేశంలో మానవ హక్కులకు  అత్యుత్తమ రక్షణ ఉందన్నారు.  

చైనా–పాక్‌ ప్రకటనపై భారత్‌ మండిపాటు
పాకిస్తాన్‌లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో కశ్మీర్‌ అంశంపై రెండు దేశాల సంయుక్త ప్రకటనపై భారత్‌ మండిపడింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ మాట్లాడుతూ..‘కశ్మీర్‌కు సంబంధించి రెండు దేశాల సంయుక్త ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో విడదీయరాని అంతర్భాగం’అని పేర్కొన్నారు. ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపెక్‌) పేరుతో తీసుకునే చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాకిస్తాన్‌ ఆ ప్రాంతాన్ని 1947 నుంచి చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంది’అని పేర్కొన్నారు.

‘భారత్‌లోని కశ్మీర్‌ రాష్ట్రం’ పాక్‌ విదేశాంగ మంత్రి
భారత్‌లోని కశ్మీర్‌ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి అన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపైనా పాక్‌ నేతలు మామూలుగా కశ్మీర్‌ అంటూ ప్రస్తావిస్తుంటారు. కానీ, ఖురేషి  మంగళవారం యూఎన్‌హెచ్చార్సీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌లోని కశ్మీర్‌ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులున్నాయని అంటున్నారు. అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థలను అక్కడికి ఎందుకు అనుమతించడం లేదు? మీడియాపై ఆంక్షలెందుకు? స్వచ్ఛంద, పౌర సంస్థలను కశ్మీర్‌లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అనంతరం  ఆయన యూఎన్‌హెచ్చార్సీ భేటీలో మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని భారత్‌ రద్దు చేసింది. కశ్మీర్‌ ప్రజలకు న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాం. యూఎన్‌హెచ్చార్సీ మౌనంగా ఉండటం ఇబ్బందికర పరిణామం’ అని అన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా