పాక్‌.. విషం చిమ్మడం మానుకోవాలి

8 Jul, 2020 15:05 IST|Sakshi
పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(ఫైల్‌ ఫొటో)

భారత ప్రతినిధి మహవీర్‌ సింఘ్వీ

న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల గురించి పదే పదే మాట్లాడే పాకిస్తాన్..  ‘ఉగ్రవాదుల స్వర్గధామం’గా ఎందుకు పేరుపొందిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్‌ హితవు పలికింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే దాయాది దేశం మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను వెళ్లగొట్టేలా అంతర్జాతీయ సమాజం పాక్‌కు పిలునివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వర్చువల్‌ ‘కౌంటర్‌- టెర్రరిజం’ వీక్‌లో భాగంగా.. ‘‘ప్రపంచానికి శాపంగా పరిణమించిన ఉగ్రవాదం: మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు, పెచ్చు మీరుతున్న తీవ్రవాదం మరియు విద్వేష ప్రసంగాలు, ట్రెండ్స్‌’’ అనే టాపిక్‌పై వెబినార్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా భారత ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించిన మహవీర్‌ సింఘ్వీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్‌కు ఈ మేరకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.(పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం..)

‘‘పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామం వంటిదని ప్రపంచ దేశాలు అంటున్నాయి. అందుకు తగినట్లుగా వారి భూభాగం నుంచి ఉగ్రవాదుల్ని ఏరివేసేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచాలి. ప్రస్తుతం ప్రపంచమంతా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. దురదృష్టవశాత్తూ పాక్‌ మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని, టెర్రరిస్టులను పెంచి పోషించే పనిలో ఉంది. ఇందుకు తన సైన్యాన్ని ఉపయోగించుకుంటోంది. ఆర్థికంగా వారికి సహకరిస్తోంది. అంతేగాకుండా భారత్‌పై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది’’ అని ఆయన మండిపడ్డారు. (పాక్‌ ఇప్పటికి ఉగ్రవాదులకు స్వర్గధామమే)

విషం చిమ్మడం మానేసి..
అదే విధంగా.. భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌ గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్‌.. బలూచిస్థాన్‌, ఖైబర్‌ ఫంక్తువా సహా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. వివిధ మతాలు, సంస్కృతులు, ఆచారాలు పాటిస్తున్న మైనార్టీలపై ఎందుకు వివక్ష చూపుతోందని మహవీర్‌ ధ్వజమెత్తారు. భారత్‌ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. అన్నిమతాల వారికి భారత్‌లో సముచిత స్థానం లభిస్తుందని.. దేశ రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత పదవుల్లో వారు పనిచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాబట్టి భారత్‌ వైపు వేళ్లు చూపుతూ... ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విషం చిమ్మడం మానేసి తమ దేశంలో ఏం జరుగుతుందో చూసుకుంటే బాగుంటుందని ఘాటుగా విమర్శించారు. (తీరు మారని పాక్‌‌.. అమెరికా ఫైర్‌!)

‘పాక్‌ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్‌’

మరిన్ని వార్తలు