భారత్-ఎన్‌ఎస్‌జీకి మధ్య ‘చైనా వాల్’

22 Jun, 2016 00:52 IST|Sakshi

సభ్యత్వం ఆశలపై నీళ్లు!  
 
 బీజింగ్: ప్రతిష్టాత్మక అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వంపై  ఉత్కంఠ నెలకొంది. ఓపక్క అమెరికా వంటి దేశాలు పూర్తి మద్దతు తెలుపుతుంటే.. భారత్‌కు సభ్యత్వాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)లో లేని భారత్‌కు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వమెలా ఇస్తారంటూ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఈ వ్యవహారంలో మొత్తం 48 దేశాల ఈ కూటమి రెండుగా విడిపోయింది. తాము ఏ దేశానికీ వ్యతిరేకం కాదని చెబుతూనే భారత్‌కు అమెరికా మద్దతు తెలపడాన్ని చైనా విదేశాంగ శాఖ తప్పుపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌పీటీలో సభ్యులు కానివారికి ఎన్‌ఎస్‌జీలో ఎలా చోటు కల్పిస్తారని ప్రశ్నిస్తోంది.

సియోల్‌లో గురు, శుక్రవారాల్లో జరగనున్న ఎన్‌ఎస్‌జీ ప్లీనరీ నేపథ్యంలో... భారత్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా సభ్య దేశాలను అమెరికా తాజాగా కోరింది. దీనిపై చైనా ఈ మేరకు స్పందించింది. ఒకవేళ భారత్‌కు నిబంధనలు సడలిస్తే అవే నిబంధనలు  పాక్‌కూ వర్తిస్తాయంది. ఫలితంగా ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వం అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు 20 దేశాలు మద్దతు తెలుపుతుండగా, మరికొన్ని ఎటువైపన్నదినిర్ణయించుకోలేదు. చైనా వంటి కొన్ని దేశాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. సియోల్  పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం పొందాలంటే ఎన్‌పీటీలో సభ్యదేశంగా ఉండాలన్న కచ్చితమైన నిబంధనేమీ లేదంటూ, అందుకు ఫ్రాన్స్‌ను భారత్ ఉదాహరణగా పేర్కొంది.కాగా, ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం రాకుండా విజయవంతంగా అడ్గుకోగలిగామని పాకిస్తాన్ ప్రకటించింది.
 
 ఎస్‌సీఓలోకి భారత్
 అంతర్జాతీయ భద్రత విషయాల్లో భారత్ మరో అడుగు ముందుకు వేయనుంది. కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)లోశాశ్వత సభ్యత్వం పొందేందుకు రంగం సిద్ధమైంది. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో గురువారం ప్రారంభమయ్యే ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో దాయాది పాక్‌తో కలసి ఈ సభ్యత్వాన్ని పొందడం లాంఛనమే!  ప్రధాని మోదీ ఈ సదస్సుకు వెళ్తారు.

>
మరిన్ని వార్తలు