బీఆర్‌ఐకి వ్యతిరేకం

11 Jun, 2018 01:39 IST|Sakshi
ఆదివారం చింగ్‌దావ్‌లో ఎస్‌సీఓ సదస్సుకు వస్తున్న మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌

ఎస్‌సీవో వేదికపై స్పష్టం చేసిన మోదీ

మద్దతు తెలిపిన మిగిలిన అన్ని సభ్యదేశాలు

పరస్పర సహకారంతోనే ముందడుగు: జిన్‌పింగ్‌  

చింగ్‌దావ్‌: చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) తమకు ఆమోదయోగ్యం కాదని భారత్‌ తేల్చిచెప్పింది. చైనాలోని చింగ్‌దావ్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం వేదికగా బీఆర్‌ఐపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఏ భారీ ప్రాజెక్టు అయినా.. ఈ కూటమి సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. మధ్య ఆసియా దేశాలతో స్నేహాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఎస్‌సీవో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఉగ్రవాద ప్రభావానికి అతి దురదృష్టకర ఉదాహరణగా అఫ్గాన్‌ నిలిచిందని.. అక్కడ శాంతి నెలకొల్పడంలో భారత్‌ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని తెలిపారు. అనంతరం ఎస్‌సీవో డిక్లరేషన్‌పై భారత్, రష్యా, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్‌ దేశాలు సంతకం చేశాయి. భారత్‌ మినహా మిగిలిన దేశాలన్నీ బీఆర్‌ఐకి అంగీకారం తెలిపాయి. సదస్సు సందర్భంగా భారత్‌ ప్రధాని, పాక్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ పరస్పరం కరచాలనం చేసుకుని, పలకరించుకున్నారు. అయితే వీరి మధ్య చర్చలేమీ జరగలేదు. రెండ్రోజుల ఎస్‌సీవో సదస్సు ముగిసిన అనంతరం మోదీ భారత్‌ బయల్దేరారు.

అనుసంధానతే మా లక్ష్యం.. కానీ!
ఆదివారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. బీఆర్‌ఐని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ మెగా ప్రాజెక్టు అయినా సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందే. ఇతర దేశాలతో అనుసంధానత పెంచుకోవడమే మా ప్రాధాన్యత. అయితే అందరినీ కలుపుకుపోయే ప్రాజెక్టులను మేం సంపూర్ణంగా స్వాగతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్నేషనల్‌ నార్త్‌–సౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ (ఐఎన్‌ఎస్‌టీసీ – 7,200 కి.మీ. పాటు వివిధ రకాల రవాణా మార్గాలతో నిర్మించే ఈ ప్రాజెక్టు భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్‌బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌లను కలపనుంది)లో భాగస్వామ్యం, ఇరాన్‌లోని ఛబహర్‌ పోర్టు అభివృద్ధి, అష్గాబట్‌ (వివిధ రవాణా మార్గాల ఏర్పాటుకు భారత్, ఇరాన్, కజకిస్తాన్, ఒమన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ దేశాల మధ్య కుదిరింది) ఒప్పందం తదితర ప్రాజెక్టుల్లో భారత్‌ చురుకైన పాత్ర పోషించడమే అనుసంధానతపై తమ విధానాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

ఉగ్రవాదంపై సమైక్యపోరు: ఉగ్రవాదంపై అన్ని దేశాలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. అఫ్గానిస్తాన్‌ ఉగ్రవాదానికి బలైపోయి దురదృష్టకర ఉదాహరణగా నిలిచిందన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశాధ్యక్షుడు ఘనీ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు.

ప్రచ్ఛన్న యుద్ధ ఆలోచనలు మనకొద్దు: జిన్‌పింగ్‌
ఎస్‌సీవోలోకి భారత్, పాక్‌లు శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘అన్ని దేశాలూ ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మెరుగుపరుచుకునేందుకు పరస్పర సహకారం అనే నినాదంతో పనిచేయాలి. బీఆర్‌ఐ సహకారాన్ని, మన అభివృద్ధి వ్యూహాలను పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఎస్‌సీవో ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. సరికొత్త సహకారం అందనుంది. అయితే మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించాలి. సభ్యదేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని, తమ భద్రతకోసం ఇతరుల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలి. దీర్ఘదృష్టి లేకుండా తీసుకునే నిర్ణయాలను (పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ) మనం సమర్థించకూడదు’ అని జిన్‌పింగ్‌ అన్నారు.

బీఆర్‌ఐ ఏంటి?
ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్‌ దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చైనా వెల్లడించింది. అయితే పలు దేశాలకు ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నాయి.

అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని పెంచుకునేందుకే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని ఆ దేశాలు భావిస్తున్నాయి. అయితే.. బీఆర్‌ఐలో చైనా–పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) భాగంగా ఉంది. ఈ సీపీఈసీ కోసం చైనా రూ.3.4 లక్షలకోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ గుండా వెళ్తోంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్‌ భావిస్తోంది.

మరిన్ని వార్తలు