నమస్తేతో ఐక్యరాజ్యసమితికి అక్బరుద్దీన్‌ వీడ్కోలు

30 Apr, 2020 14:29 IST|Sakshi

ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్‌ తిరుమూర్తి నియామకం

న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితిలో భారత కీర్తిప్రతిష్టలు మరింత పెరిగేలా తన పదునైన మాటలతో ఆకట్టుకున్న భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ గురువారం రిటైర్‌ అయ్యారు. ముఖ్యంగా ఐరాసాలో భారత్‌పై పాక్ తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతీసారి పాక్‌ ప్రతినిధులనోట మాట రాకుండా సయ్యద్‌ కడిగిపారేసేవారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌) అధికారి 2016 జనవరి నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సయ్యద్‌ తర్వాత ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్‌ తిరుమూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పని చేస్తున్నారు. 
 
ఇక తన వీడ్కోలు సందర్భాన్నికూడా కరోనావ్యాప్తిని అరికట్టడానికి వీలుపడే ఓ మంచి సూచనను ఇవ్వడానికి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ప్రయత్నించారు. వీడియో కాల్‌ ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు భారత సంప్రదాయ పద్దతిలో నమస్కరించి తన విధులనుంచి తప్పుకున్నారు. నమస్కరించడానికి సమయం ఆసన్నమైంది అంటూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుటెరస్‌కు నమస్కరిస్తున్న వీడియోను తన ట్విటర్‌ఖాతాలో సయ్యద్‌ పోస్ట్‌ చేశారు. తన విధులనుంచి తప్పుకునే ముందు ఓ చిన్న విన్నపం అంటూ గుటేరస్‌కు విజ్ఞప్తి చేశారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరినైనా కలిసినప్పుడు లేదా వీడ్కోలు సమయాల్లో హలోగానీ, షేక్‌ హ్యాండ్‌వంటివి కాకుండా నమస్తే అని చెబుతారు. అందుకే ఇప్పుడు కూడా నమస్తే చెప్పాలని అనుకుంటున్నాను అని గుటెరస్‌తో సయ్యద్‌ అన్నారు. దీనికి చిరునవ్వుతో నమస్తే అంటూ గుటెరస్‌కూడా బదులిచ్చారు.

మరిన్ని వార్తలు