శాంతికి దోహదం చేస్తాయి..!

28 Sep, 2017 19:38 IST|Sakshi

మారుతున్న చైనా స్వరం

భారత్‌పై సానుకూలంగా వ్యవహరిస్తున్న డ్రాగన్‌

బీజింగ్‌ : భారత్‌ విషయంలో చైనా స్వరం మారుతోంది. ముఖ్యంగా డోక్లామ్‌ వివాదం తరువాత భారత్‌ గురించి మాట్లాడేటప్పుడు.. చాలా సంయమనంగా వ్యవహరిస్తోంది. భారత్‌-అమెరికా రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల గురించి చైనా గురువారం సానుకూలంగా స్పందించింది. భారత్‌-అమెరికా మధ్య ఏర్పడుతున్న రక్షణ సంబంధాలు.. ఆసియాలో శాంతికి అనుకూలిస్తాయని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ వూ కియాన్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌-అమెరికాల మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాలపై తమ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉందన్నారు. భారత్‌-అమెరికా బంధం బలోపేతం కావడం వల్ల ఆసియాలో శాంతి నెలకొంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్‌ మాటిస్‌ ఈ నెల 26, 27 తేదీల్లో భారత్‌లో పర్యటించడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

ఎఫ్‌-16 యుద్ధవిమానాలను 'మేకిన్‌ ఇండియా'లో భాగంగా రూపొందించడం, భారత్‌కు గార్డియన్‌ డ్రోన్ల అమ్మకంపైనా చైనా ఆచితూచి స్పందించింది. హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ఉద్దేశించిన గార్డియన్‌ డ్రోన్ల క్రయవిక్రయాలపైనా డ్రాగన్‌ స్పందిస్తూ.. దీని గురించి పెద్దగా ఆలోచించే పని లేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు