పాక్, చైనాలకు మాల్దీవుల దూతలు

9 Feb, 2018 02:27 IST|Sakshi
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌

సంక్షోభ పరిష్కారానికి పంపిన ఆ దేశాధ్యక్షుడు యమీన్‌ 

మాలె: మాల్దీవుల అంతర్గత సంక్షోభ పరిష్కారానికి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియాలకు ప్రత్యేక దూతలను పంపారు. ప్రధాని  మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా  తీరికలేని షెడ్యూల్‌ కారణంగా తమ ప్రతినిధి ఇక్కడికి రావడం లేదని ఢిల్లీలో మాల్దీవుల రాయబారి వెల్లడించారు. తమ దేశంలోని పరిస్థితులను వివరించేందుకు మాల్దీవుల ఆర్థికాభివృద్ధి మంత్రి మహ్మద్‌ సయీద్‌ చైనాకు, విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఆసిమ్‌ పాకిస్తాన్‌కు, వ్యవసాయ మంత్రి మహ్మద్‌ షైనీ సౌదీ అరేబియాకు వెళ్లారు.

ఢిల్లీలో మాల్దీవుల రాయబారి అహ్మద్‌ మహ్మద్‌ గురువారం స్పందిస్తూ..తమ ప్రతినిధి పర్యటనకు తొలుత భారత్‌నే ఎంచుకున్నామని కానీ, ఈ వారంలో మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాలు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండబోతుండటం వల్లే విరమించుకున్నామని తెలిపారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యంపై భారత్‌ వెలిబుచ్చిన ఆందోళనలపై ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎవరైనా ప్రతినిధిని పంపే ముందు ప్రత్యేక ప్రొటోకాల్‌ ఉంటుందని, తమ ప్రతినిధి ఎందుకు రాబోతున్నారో భారత్‌కు మాల్దీవులు తెలియజేయలేదని వెల్లడించాయి.

మరిన్ని వార్తలు