సంక్లిష్ట అంశాలలో భారత్‌ తొందరపడదు: విదేశాంగ శాఖ

20 Feb, 2020 18:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  అయితే సంక్లిష్ట అంశాలపై చర్చ జరిగే సందర్భంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కుదుర్చుకునే అంశంలో భారత్‌ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రథినిధులు తెలిపారు. పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తులను భారత్‌ ఎగుమతి చేసుకోవాలని అమెరికా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ పర్యటన ఉత్కంఠ కలిగిస్తుంది.

ట్రంప్‌ పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశముందని ప్రభత్వ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా కొనసాగాలంటే అగ్రనేతల పర్యటనలు ఎంతో కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. ప్రపంచంలో అత్యంత పెద్దదిగా భావిస్తున్న గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ క్రికెట్‌ స్టేడియాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ట్రంప్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు.

మరిన్ని వార్తలు