'2014లో మళ్లీ అధికారంలోకి వస్తాం'

11 Oct, 2013 21:01 IST|Sakshi

వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ధీమా వ్యక్తంచేశారు. ‘మేము అధికారంలోకి వచ్చేందుకు భారత్ మళ్లీ మాకే ఓటేస్తుందన్న విషయం మీ అధ్యయనంలోనూ రూఢీ అవుతుంది’ అని చిదంబరం గురువారం వాషింగ్టన్‌లో ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకుల వార్షిక ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు చిదంబరం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

 

వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన పరిణామాలపై కార్నెగీ అనే అమెరికా సంస్థ ‘ఇండియా డిసెడైడ్ 2014’ పేరుతో అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు దీనిపై అనవసరంగా మీ సమయాన్ని వృథాచేసుకోవద్దు’ అని ఎన్నికల ఫలితాల గురించి చిదంబరం చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అక్కడ ఒబామా పరిపాలనా యంత్రాంగం, మేథావులు, విద్యావేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు తదితర ప్రముఖులున్నారు.
 

మరిన్ని వార్తలు