అమెరికా రికార్డును అధిగమించనున్న భారత్‌..!

22 Feb, 2019 17:58 IST|Sakshi

వాషింగ్టన్‌ : భారత్‌లో త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల వ్యయం అమెరికాను మించిపోనుంది. తద్వారా అత్యధిక ఎన్నికల వ్యయం చేసిన ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ నిలవనుంది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష, కాంగ్రెషనల్‌ ఎన్నికల్లో జరిగిన 6.5 బిలియన్‌ డాలర్ల (సుమారు 46 వేలకోట్లు) ఖర్చే ఇప్పటి వరకు అత్యధిక వ్యయంతో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో 5 బిలియన్‌ డాలర్లు (సుమారు 35 వేలకోట్లు) ఖర్చు కాగా, 2019 ఎన్నికల్లో ఆ మొత్తం పెరగనుంది. అంటే అమెరికా 6.5 బిలియన్‌ డాలర్లకన్నా ఎక్కువ ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో ఖర్చు కానుందని అంతర్జాతీయ శాంతి కోసం ఏర్పాటు చేసిన మేధావుల సంఘంలో సభ్యుడు, నిపుణుడు మిలన్‌ వైష్ణోవ్‌ అభిప్రాయపడ్డారు. (ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం!)

ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడం, ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, వారికి ఓటరు స్లిప్పులను పంచడం తదితర అంశాల కారణంగా ఎన్నికల వ్యయం పెరిగుతున్నట్టు తెలిపారు. ఇదిలాఉండగా.. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. జూన్‌ 3వ తేదీన 16వ లోక్‌సభ పదవీ కాలం ముగుస్తుంది. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల (ఆంధ్రప్రదేశ్‌(జూన్‌ 18న), అరుణాచల్‌ ప్రదేశ్‌ (జూన్‌1న), ఒడిశా (జూన్‌ 11న), సిక్కిం (మే 27న)) పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిచాలని ఈసీ భావిస్తోంది. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్‌ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది.

మరిన్ని వార్తలు