సిక్కు నటుడికి చేదు అనుభవం

9 Feb, 2016 11:09 IST|Sakshi
సిక్కు నటుడికి చేదు అనుభవం

మెక్సికో: సిక్కు జాతీయుడికి మెక్సికో ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాను మెక్సికో ఫ్లైట్ సిబ్బంది మంగళవారం ఉదయం అడ్డుకున్నారు. ఆ నటుడు మెక్సికో నుంచి న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే, తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. ఈ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు.

మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి సిద్ధమైన సిక్కు వ్యక్తి ఎయిర్ పోర్ట్ అధికారుల నుంచి జాత్యహంకారానికి గురయ్యాడు. తాను లేకపోతే న్యూయార్క్ లో ఫ్యాషన్ షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. యూఎస్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు సెక్యూరిటీ నిమిత్తం కొన్ని రూల్స్ పాటించాలని సోమవారం తమకు ఆదేశాలు వచ్చాయని మెక్సికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అతడికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని... ప్రయాణికుల మత విశ్వాసాలను పక్కనబెట్టి నిబంధనలు పాటించడమే తమ బాధ్యత అని ఎయిర్ లైన్స్ అధికారులు వివరించారు. 

>
మరిన్ని వార్తలు