భారత సంతతి బాలికకు యువ శాస్త్రవేత్త అవార్డు

21 Oct, 2017 03:13 IST|Sakshi

అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా పదకొండేళ్ల గీతాంజలిరావు అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్‌ త్రీఎం యంగ్‌ సైంటిస్ట్‌ చాలెంజ్‌’లో ప్రథమ స్థానం దక్కింది.

రెండేళ్ల కింద మిషిగన్‌ ప్రాంతంలోని ఫ్లింట్‌ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో సీసం కాలుష్యాన్ని గుర్తించేందుకు రెండు పద్ధతులన్నాయి. ప్రత్యేకమైన పట్టీలతో చేసే పరీక్ష ఒకటి. దీనిద్వారా కాలుష్యం సంగతి వెంటనే తెలిసిపోతుంది గానీ.. కొన్నిసార్లు కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు.

ఇక రెండోది ప్రభుత్వ సంస్థలకు నీటి నమూనాలను పంపి పరీక్షించడం. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గీతాంజలి త్రీఎం శాస్త్రవేత్తలతో కలసి తన ఆలోచనలను ఆచరణలో పెట్టింది. కార్బన్‌ నానో ట్యూబులతో పనిచేసే ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది నీటిలోని సీసం కాలుష్యాన్ని గుర్తించడంతోపాటు ఆ సమాచారాన్ని బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కు పంపిస్తుంది. ప్రస్తుతం గీతాంజలి తన పరికరానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది.

మరిన్ని వార్తలు