కరోనా: సీనియర్ జర్నలిస్టు మృతి, ప్రధాని సంతాపం

8 Apr, 2020 10:17 IST|Sakshi
కంచిభొట్ల బ్రహ్మ(ఫైల్ ఫోటో)

న్యూయార్క్ : అమెరికాలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి మారణహోమానికి పలువురు భారతీయ సంతతికి చెందిన వారు కూడా బలవుతున్నారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా మాజీ కరస్పాండెంట్ కంచిభొట్ల బ్రహ్మ (66) న్యూయార్క్‌లోమరణించారు. కరోనా లక్షణాలతో మార్చి 23న ఆయన ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి మరింత విషమించడంతో లాంగ్ ఐలాండ్‌లోని ఆసుపత్రిలో వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందించారు. ఆసుపత్రిలో తొమ్మిది రోజుల పోరాటం అనంతరం సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు జర్నలిస్టులు, అమెరికా తెలుగు సంఘాలు సంతాపాన్ని ప్రకటించాయి. న్యూయార్క్ నగరంలో ఆంక్షలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంత్యక్రియలపై తమ కుటుంబానికి స్పష్టత లేదని బ్రహ్మ కుమారుడు సుధామ తెలిపారు.

పాత్రికేయుడుగా భారతదేశంలో పలు వార్తా సంస్థల్లో పనిచేసిన ఆయన 1992 లో అమెరికాకు వెళ్లారు. బ్రహ్మ కంచిభొట్లకు భార్య అంజన, కుమారుడు సుధామ, కుమార్తె సియుజనా ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత, అమెరికా సంబంధాలపై ఆయన చేసిన కృషి , సేవలు నిలిచిపోతాయన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మ కుటుంబానికి, సన్నిహితులకు తన సానుభూతి  ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. కాగా అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. మొత్తం 368,196 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 10,986 గా ఉంది. న్యూయార్క్ నగరంలోనే కనీసం 4,758 మంది మరణించారు.

మరిన్ని వార్తలు