స్పెల్లింగ్‌ బీ విజేత హైదరాబాదీ

2 Jun, 2018 05:07 IST|Sakshi

హ్యూస్టన్‌: అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ’ పోటీలో భారత సంతతికి చెందిన కార్తీక్‌ నెమ్మాని(14) విజేతగా నిలిచాడు. టెక్సాస్‌లోని మెక్‌కిన్నీకి చెందిన కార్తీక్‌ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కార్తీక్‌ తండ్రి కృష్ణ నెమ్మాని హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వలసవెళ్లారు. కార్తీక్‌ తుది పోరులో భారత సంతతికే చెందిన నయాసా మోదీ అనే బాలికతో పోటీపడి విజయం సాధించాడు. తుదిపోరులో 'koinonia' అనే పదానికి సరైన స్పెల్లింగ్‌ చెప్పి కార్తీక్‌ విజేతగా నిలిచాడు. టైటిల్‌ గెలిచిన కార్తీక్‌కు 40 వేల  డాలర్లు, ట్రోఫీని ఇస్తారు. కార్తీక్‌కు మరియం–వెబ్‌స్టర్‌ నుంచి 2,500 డాలర్లు, న్యూయార్క్, హాలీవుడ్‌లలో ఉచితంగా పర్యటించే చాన్స్‌ ఇస్తారు. ఈ సారి పోటీలో మొత్తం 516 మంది విద్యార్థులు పోటీపడగా, ఫైనల్‌కు 16 మంది చేరుకున్నారు. వీరిలో 9 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. గత 11 ఏళ్లుగా భారత సంతతి విద్యార్థులే ఈ పోటీల్లో గెలుస్తున్నారు. 

మరిన్ని వార్తలు