ఎన్నారై మహిళకు బంపర్ చాన్స్

23 Nov, 2016 18:44 IST|Sakshi
ఐక్యరాజ్య సమితికి ఎన్నారై మహిళ
భారత​-అమెరికన్‌ మహిళ నిక్కీ హేలీకి బంపర్ చాన్స్ తగిలింది. దక్షిణ కరొలినా గవర్నర్‌గా ఉన్న ఆమె.. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా వెళ్లనున్నారు. ఈ మేరకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను ఆమె అంగీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. దీంతో కేబినెట్ స్థాయిలో ట్రంప్ నియమించిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. అయితే ట్రంప్ బృందం మాత్రం ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 
 
నిక్కీ హేలీ (44) తల్లిదండ్రులు భారత దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆమె రెండోసారి దక్షిణ కరొలినా గవర్నర్‌గా ఉన్నారు. గవర్నర్‌గా ఉన్న పాలనాకాలంలో వాణిజ్య, కార్మిక సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఆమెకు దౌత్యపరమైన అనుభవం మాత్రం పెద్దగా లేదు. కానీ, అమెరికా సైన్యం, జాతీయ భద్రత లాంటి అంశాల్లో ఆమె విధానాలు ప్రధానస్రవంతిలోని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో సరిపోతాయని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. 
 
ప్రధానమైన పదవుల్లో ఎవరెవరిని నియమించాలనే అంశంపై చర్చలలో భాగంగా గత వారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నిక్కీ హేలీని డోనాల్డ్ ట్రంప్ కలిసి చర్చించారు. దాంతో.. మిట్‌ రోమ్నీతో పాటు ఆమెను కూడా విదేశాంగ మంత్రిని చేయబోతున్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం హేలీని ఐక్యరాజ్య సమితికి పంపడం దాదాపు ఖాయమైనట్లే చెబుతున్నారు.
మరిన్ని వార్తలు