అమెరికాలో మరో భారతీయుడికి అవమానం

23 Apr, 2017 01:50 IST|Sakshi
భారత సంతతి సర్జన్ జనరల్‌ను తీసేసిన ట్రంప్

అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో తమ సొంత మనిషిన పెట్టుకోడానికి వీలుగా ఆయనను రాజీనామా చేయాలని కోరింది. ఒబామా హయాంలో డాక్టర్ వివేక్ మూర్తిని అమెరికా సర్జన్ జనరల్‌గా నియమించారు. వివేక్ మూర్తిని రాజీనామా చేయమన్న విషయాన్ని అమెరికా ఆరోగ్య, మనావసేవల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మూర్తి సర్జన్ జనరల్ విధుల నుంచి రిలీవ్ అయ్యారని, కమిషన్డ్ కోర్ సభ్యుడిగా మాత్రం సేవలు అందిస్తారని ఆ ప్రకటనలో చెప్పారు.

ఇన్నాళ్ల పాటు ఇంత ప్రతిష్ఠాత్మకమైన పదవిలో తనను కొనసాగించడం తనకు చాలా గౌరవమని, అదృష్టమని డాక్టర్ వివేక్ మూర్తి ఒక ఫేస్‌బుక్ పోస్టింగులో పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశం మొత్తానికి ఆరోగ్య విషయాలు చూసుకోవాలని అధ్యక్షుడు అడిగే వరకు ఎదదగడం భారతదేశంలో ఒక పేద రైతు మనవడికి చాలా గౌరవమని, 40 ఏళ్ల క్రితం వలస వచ్చిన తన కుటుంబాన్ని ఆదరించి, తనకు ఈ విధంగా సేవ చేసే అవకాశం కల్పించినందుకు అమెరికాకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. ప్రస్తుతం డిప్యూటీ సర్జన్ జనరల్‌గా ఉన్న రియర్ అడ్మిరల్ సిల్వియా ట్రెంట్ ఆడమ్స్‌ను వివేక్ మూర్తి స్థానంలో సర్జన్ జనరల్‌గా నియమించారు. ఇలాంటి సీనియర్ పదవుల నుంచి తొలగింపునకు గురైన రెండో భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి. ఇంతకుముందు అటార్నీ జనరల్ పదవిన ఉంచి ప్రీత్ బరారాను తీసేశారు. ఆయనను రాజీనామా చేయమని కోరినా ఆయన తిరస్కరించడంతో బలవంతంగా తొలగించారు.

2014 డిసెంబర్ నెలలో డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా నియమించాలని ఒబామా భావించినప్పుడు దానికి సెనేట్ 51-43 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ నేతృత్వంలోని గన్ అనుకూల లాబీ ఆయన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సర్జన్ జనరల్ పదవీకాలం నాలుగేళ్లు. 37 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. డాక్టర్ మూర్తి తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు. ఇయన ఇంగ్లండ్‌లోని హడర్స్‌ఫీల్డ్‌లో జన్మించి, ఫ్లోరిడాలోని మియామీ ప్రాంతానికి మూడేళ్ల వయసులో వలస వెళ్లారు. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీయే చేశారు. ప్రస్తుతం ఆయన బోస్టన్‌లోని బ్రిగామ్, ఉమెన్స్‌ ఆస్పత్రిలో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో వైద్య అధ్యాపకుడిగా కూడా పనిచేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు