లధాఖ్‌లో భారత్‌-చైనా సైనికుల ఘర్షణ

12 Sep, 2019 10:41 IST|Sakshi

సరిహద్దు ప్రాంతంలో తలపడిన ఇరుదేశాల జవాన్లు

పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత సైన్యం గస్తి.. చైనా అభ్యంతరం

న్యూఢిల్లీ: లధాఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో భారత్‌, చైనా సైన్యాలు పరస్పరం తలపడ్డాయి. లధాఖ్‌లోని ఉత్తర ప్యాంగాంగ్‌ సరస్సు సమీపంలో బుధవారం ఉదయం ఇరుదేశాల సైనికులు పరస్పరం బాహాబాహికి దిగారు. అయితే, ఇరుదేశాల సైన్యం తరఫున ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరగడంతో ఇక్కడ ఉద్రిక్తత సమసిపోయింది. చర్చల అనంతరం అక్కడ యథాతథ స్థితి కొనసాగుతోంది.

134 కిలోమీటర్ల ప్యాంగాంగ్‌ సో సరస్సు వద్ద భారత సైన్యం బుధవారం ఉదయం గస్తీ నిర్వహిస్తుండగా.. చైనాకు చెందిన పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) జవాన్లు అక్కడికి వచ్చి.. ముఖాముఖి తలపడ్డారు. సరస్సు వద్ద భారత సైన్యం గస్తీ నిర్వహించడంపై పీఎల్‌ఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబేట్‌, లధాఖ్‌ మధ్య ఉన్న ప్యాంగాంగ్‌ సరస్సులో మూడొంతుల భాగం చైనా అధీనంలో ఉంది. పీఎల్‌ఏ అభ్యంతరంతో ఇరుదేశాల సైనికుల మధ్య గొడవ ప్రారంభమయింది. బుధవారం ఉదయం నుంచి రోజంతా ఇరుదేశాల సైనికులు పరస్పరం తలపడుతూ.. తోపులాటకు దిగారు. సాయంత్రానికి ఇరుదేశాల సైన్యాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. అయితే, సాయంత్రానికి ప్రోటోకాల్‌ ప్రకారం బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు చర్చలు జరపడంతో ఈ ఉద్రికతలకు తెరపడింది. గతంలో 2017లోనూ ఇక్కడ భారత్‌-చైనా సైన్యాలు తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం సైనికులు కొట్టుకున్నారు.

 

మరిన్ని వార్తలు