భారతీయుడికి సహకరించిన పాక్ జర్నలిస్టు కిడ్నాప్

28 Mar, 2016 00:55 IST|Sakshi
భారతీయుడికి సహకరించిన పాక్ జర్నలిస్టు కిడ్నాప్

లాహోర్: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్  జైల్లో ఉన్న భారత ఇంజనీర్ హమీద్ అన్సారీ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు పరిశోధిస్తున్న పాక్ మహిళా జర్నలిస్టు జీనత్ షాజది అదృశ్యమవడంతో ఆమె ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విజ్ఞప్తి చేశారు. 7 నెలలుగా జీనత్ కనిపించడం లేదని, భారతీయ ఖైదీకి సాయపడడం వల్లే ఈ సంఘటన జరిగిందని సోదరుడు సల్మాన్ లతీఫ్ సోమవారం తెలిపాడు. తన సోదరి కనిపించక బెంగతో మరో సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ క్షోభ భరించలేమని  వాపోయాడు.

స్థానిక పత్రికా విలేకరిగా పనిచేస్తున్న జీనత్ ఆగస్టు 19, 2015న ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుండగా అదృశ్యమైంది. నవంబర్, 2012 నుంచి భారత్‌కు చెందిన హమీద్ పాకిస్తాన్ వెళ్లి కనిపించకుండా పోయాడు. హమీద్ తల్లి ఫౌజియా తరఫున సుప్రీంకోర్టులోని మానవహక్కుల విభాగంలో జీనత్ పిల్ దాఖలు చేశారు. ఈ కేసుపై పెషావర్ హైకోర్టులోనూ ఆమె వాదించారు. పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం సమాచారం మేరకు... పాక్ యువతితో హమీద్(28) ఫేస్‌బుక్‌లో ప్రేమలో పడ్డాడు. పాక్ వెళ్లేందుకు వీసా రాకపోవడంతో కాబూల్ నుంచి పాకిస్తాన్ చేరుకున్నాడు. నవంబర్ 12, 2012న పాక్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని భద్రతా సంస్థలకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు