-

బ్రెగ్జిట్ ఎఫెక్ట్: సాఫ్ట్వేర్ పరిశ్రమకు ముప్పు?

25 Jun, 2016 09:17 IST|Sakshi
బ్రెగ్జిట్ ఎఫెక్ట్: సాఫ్ట్వేర్ పరిశ్రమకు ముప్పు?

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయం అక్కడ ఉంటున్న భారతీయుల ఉద్యోగాలకు ఎసరు తెస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. దాంతోపాటు భారతీయ ఐటీ కంపెనీలకు కూడా కొంతవరకు ముప్పు తప్పదని అంటున్నారు. యూరోపియన్ దేశాల నుంచి బ్రిటన్లోకి వలసలు ఎక్కువయ్యాయన్న ఆందోళనే ‘బ్రెగ్జిట్’ నిర్ణయానికి ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే కారణంతో అక్కడున్న భారతీయులకు సైతం ముప్పు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన లోకనాథన్ గణేశన్ యూకేలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన కంపెనీ ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉండటంతో.. ఇప్పుడు తన ఉద్యోగం ఏమవుతుందో తెలియట్లేదని భయపడుతున్నారు. 2015లో ‍బ్రిటిష్ వనితను పెళ్లాడి ఆయన బ్రిటన్కు వచ్చేశారు.

సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉందని, పరిస్థితి ఇంతకుముందులా లేదని లీడ్స్ ప్రాంతంలో ఉండే గణేశన్ చెప్పారు. యూకేకు వలస రావాలన్న ఆశలు ఇక వదులుకోవాల్సిందేనని తెలిపారు. యూరప్, బ్రిటన్లలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఐటీ కంపెనీల మీద కూడా బ్రెగ్జిట్ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఉద్యోగాల విషయంలో అనిశ్చితి తప్పదని, యూకేలో తమ కార్యకలాపాలను మూసేసుకోవాలని ఇప్పటికే కొన్ని ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయని తృప్తి పటేల్ అనే సాఫ్ట్వేర్ వాలిడేషన్ మేనేజర్ చెప్పారు. భారతదేశ ఐటీ ఎగుమతులలో 17 శాతం వరకు బ్రిటన్కే వెళ్తాయి. దాని విలువ దాదాపు రూ. 6.70 లక్షల కోట్లు!! ఇప్పుడు అక్కడి కంపెనీల కార్యకలాపాలు ఆగిపోతే.. మన సాఫ్ట్వేర్ పరిశ్రమ కూడా ఇబ్బంది పడక తప్పదని అంటున్నారు.

మరిన్ని వార్తలు