కోవిడ్‌-19 : ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు మూత

12 Feb, 2020 16:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచవ్యాప్తంగా  ఆందోళన రేపుతున్న  కోవిడ్-2019 (కరోనా వైరస్‌)  ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా  ప్రభావితం చేస్తోంది.  చైనాతో  సంబంధమున్న పలు వ్యాపారాలు  ఇప్పటికే దెబ్బ తినగా, చైనాలో పలు కంపెనీలు మూసివేతల వైపుగా పయనిస్తున్నాయి. తాజాగా భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మూసివేస్తున్నట్లు ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఆఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ బుధవారం  తెలిపారు.

చైనాలోని వుహాన్‌లో కోవిడ్‌ వైరస్ వ్యాప్తి అనేక దేశాలలో వాణిజ్యం,  అనేక పరిశ్రమలపై ప్రభావం చూపుతోందని మోహింద్రూ  వెల్లడించారు. ముఖ్యంగా  ఏవియేషన్ ,  ఎలక్ట్రానిక్స్ సహా భారతదేశంలో పలు రంగాలలో వైరస్ వ్యాప్తి  ప్రభావం ఆందోళన కరంగా ఉందన్నారు.  చైనాలోని కొన్ని కర్మాగారాలు తెరిచినప్పటికీ, కార్మికులు విధులకు హాజరవుతారా లదా అనేది ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తుందనీ, విడిభాగాలను  పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుందన్నారు. అలాగే స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లో  కూడా  విడి భాగాలు  చాలా వరకు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని తెలిపారు. కాగా కోవిడ్‌-19 శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చైనాలో పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయడంతో ఉత్పత్తులు నిలిచిపోయాయి. ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అయ్యే విడి భాగాల సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత్‌లోని ఆటో ఉత్పత్తులపై ప్రభావం పడనుందని ఆటో పరిశ్రమ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్‌లో ఆటో ఉత్పత్తులు 8.3 శాతం మేర పడిపోవచ్చునని ఫిచ్ సొల్యూషన్స్ బుధవారం అంచనా వేసింది. దేశీయ ఉత్పత్తిపై కూడా పడిపోనుందని అభిప్రాయపడింది.

చదవండి : ప్రాణాంతక కరోనా పేరు మార్పు

కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే?

మరిన్ని వార్తలు