ఇథియోపియాలో భారతీయుల నిర్బంధం

2 Dec, 2018 10:48 IST|Sakshi

ముంబై: ఇథియోపియాలోని వివిధ ప్రాజెక్టుల్లో తమ సిబ్బందిని స్థానికులు నిర్బంధించారని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థకు చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌(ఐటీఎన్‌ఎల్‌) తెలిపింది. అక్కడ నిర్వహిస్తున్న పనులకు సంబంధించి స్థానికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించినట్లు పేర్కొంది. నీరజ్‌ రఘువంశి అనే ఉద్యోగి తనతోపాటు ఏడుగురిని స్థానిక సిబ్బంది నిర్బంధించినట్లు గత నెలలో బయటపెట్టడం తెల్సిందే. దీంతో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ వెంటనే అక్కడి భారత దౌత్య కార్యాలయానికి, విదేశాంగ శాఖకు ఈ సమాచారం అందించి, సాయం కోరింది. వీరి ప్రయత్నాలు ఫలించి శనివారం ఇద్దరిని విడుదల చేశారు.

ఇతర దేశాల్లో బకాయిల చెల్లింపులకు అనుమతి కోరుతూ అక్కడి బ్యాంకులకు ఐటీఎన్‌ఎల్‌ లేఖలు రాసింది. అయితే, అనుమతుల్లో జాప్యం కారణంగా చెల్లింపులు ఆలస్యమయ్యాయని, ఇథియోపియాలోని పనివారికి వెంటనే వేతనాలు చెల్లిస్తామని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పేర్కొంది. ఐటీఎన్‌ఎల్‌ తన సబ్సిడరీ అయిన ఎల్సమెక్స్‌ ఎస్‌ఏ అనే కంపెనీ ద్వారా ఇథియోపియాలో రోడ్లు, భవనాలు, పెట్రోల్, గ్యాస్‌ స్టేషన్ల నిర్మాణ పనులు చేపడుతోంది.  

మరిన్ని వార్తలు